లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వైరస్ బలహీనం కావడం వల్లే కేసులు తగ్గుతున్నాయనే అపోహలతో జనం జాగ్రత్తలు విస్మరిస్తున్నారు. మాస్కులు, వ్యక్తిగత దూరం మరిచి యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. మానవ తప్పిదంతోనే దేశంలో రెండోదశ కరోనా ప్రమాదకరంగా మారుతోందంటున్నారు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా. కరోనా రెండో దశ వ్యాప్తిపై ఆయన మాటల్లోనే..
టీకా వచ్చేవరకు వేవ్స్..
ఒకవేళ రెండోదశ మొదలైతే కట్టడి చేయడం కష్టమే. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి రావొచ్చు. కాబట్టి జనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. టీకా రావడానికి చాలా సమయం పట్టొచ్చు. అందులోనూ దేశ వ్యాప్తంగా ఉన్న జనాభాకు టీకా అందించాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. ఆ లోపు ఇంకా చాలా వేవ్స్ వస్తూనే ఉంటాయి.
ప్రస్తుతం ఓ వైపు చలి పంజా విసురుతోంది.. మరో వైపు వరసగా పండగలు, పెళ్లి వేడుకలొస్తున్నాయి. జనం పెద్దఎత్తున గుమిగూడుతున్నారు. కరోనా వ్యాప్తి విస్తృతం కావడానికి ఇది సహకరిస్తుంది. మరింత అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం తప్పదు.
పెరిగితే ప్రమాదమే..
తెలంగాణలో మొదటి దశలో వచ్చిన కేసుల్లో ఎక్కువ మంది కోలుకున్నారు. ఇక్కడ చేపట్టిన చర్యలు అందుకు సహకరించాయి. ప్రస్తుతం కొద్దిరోజులుగా కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దాని అర్థం వైరస్ బలహీనపడుతోందని కాదు.. ఒకరోజు ఎక్కువ, మరోరోజు తక్కువ కేసులు నమోదు కావొచ్చు.