తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత కలకలం సృష్టిస్తోంది. రిమ్స్ ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు చికిత్స సరిగా అందకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు సౌకర్యాల లేమి అయితే మరోవైపు సిబ్బంది కొరత వేధిస్తోంది. దీనిపై జిల్లా వైద్యాధికారి, రిమ్స్ డైరెక్టర్ మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. కరోనా చికిత్సల సమస్యలపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో ఎమ్మెల్యే జోగు రామన్న సమావేశమయ్యారు. ఆయన సమక్షంలో ఇరువురు పరస్పర వాదనలకు దిగారు.
నోడల్ అధికారైన తనకు సమాచారం ఇవ్వకపోగా, రెమిడెసివిర్ ఇంజిక్షన్లు అందుబాటులో ఉన్నా బాధితులకు ఇవ్వడం లేదని డైరెక్టర్ తీరుపై జిల్లా వైద్యాధికారి డా. నరేందర్ రాఠోడ్ అసహనం వ్యక్తం చేశారు. స్పందించిన డైరెక్టర్ సమాధానమివ్వడానికి ఇదేం అసెంబ్లీ కాదని వ్యాఖ్యానించారు. ఇలా ఇరువురి మధ్య వాదనలు జరగడంతో ఎమ్మెల్యే జ్యోక్యం చేసుకున్నారు. దూషించుకోవడం మాని లోపాల పరిష్కారంపై సూచనలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి విపత్కర సమయంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సిబ్బంది, సౌకర్యాలను పెంచితే బాధితులకు 100 శాతం చికిత్స అందివ్వగలమని రిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. కలిసిగట్టుగా పోరాడి కరోనాను అంతమొందించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ సూచించారు.
ఇదీ చదవండి: