ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు(jagan cases)ల్లో నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టు(high court)లో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. హెటిరో-అరబిందోలకు తెలంగాణలోని మహబూబ్‌నగర్, జడ్చర్లలో ఒక్కొక్కరికి 75 ఎకరాల భూమిని కేటాయించడంపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌లపై జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ చేపట్టారు. ఈ కేసులో 9వ నిందితుడిగా ఉన్న మాజీ ఐఏఎస్, అప్పటి ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్, ఎండీ బి.పి.ఆచార్య పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు సీనియర్ న్యాయవాది టి.ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి తెలిపారు. దీనికి న్యాయమూర్తి అనుమతిచ్చారు. ఇందూటెక్‌జోన్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులను కొట్టివేయాలంటూ బీపీ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్‌లు పెండింగ్‌లోనే ఉన్నాయి. అంతకుముందు హెటిరో, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘‘సీబీఐ దురుద్దేశంతో కేసు నమోదు చేసింది. ప్రభుత్వం సెజ్ నిమిత్తం ఎకరా రూ.7లక్షల చొప్పున కేటాయించిన మాట వాస్తవమే. తక్కువ ధరకు కేటాయించినట్లు సీబీఐ చెబుతోందన్నారు. ధర నిర్ణాయక కమిటీ భూమి ధరను రూ.15 లక్షలుగా నిర్ణయించింది. అయితే ఇది భూమిని బదలాయించినప్పుడే వర్తిస్తుంది. హెటిరో ఈ భూములను లీజుకు మాత్రమే తీసుకుంది. మా కంపెనీకి రూ.8.5 కోట్ల లబ్ధి చేకూరగా దీనికి ప్రతిఫలంగా మేం రూ.19.5 కోట్ల పెట్టుబడులు పెట్టామని సీబీఐ ఆరోపించింది. క్విడ్‌ప్రోకో అయితే చేకూరిన ప్రయోజనం కంటే ఎక్కువ పెట్టుబడులు ఎందుకు పెడతాం. లాభాలనాశించే పెట్టుబడులు పెట్టాం. జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్ తదితరాల్లో పెట్టుబడులు పెట్టగా రెట్టింపు లాభాలు వచ్చాయి. కంపెనీ నిర్ణయాలకు డైరెక్టర్ బాధ్యుడంటూ సీబీఐ చెబుతోంది. వీటిని పట్టించుకోకుండా కింది కోర్టు అభియోగ పత్రాన్ని విచారణకు స్వీకరించింది. ఈ కేసుతో అంతర్జాతీయంగా పలు అవకాశాలను కోల్పోయాం’’ అని అన్నారు. దీనిపై తదుపరి విచారణను కోర్టు నవంబరు ఒకటికి వాయిదా వేసింది.
ఇండియా సిమెంట్స్‌లో దర్యాప్తు పూర్తి: ఈడీ
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్‌కు సంబంధించి నమోదు చేసిన కేసులో దర్యాప్తు పూర్తయిందంటూ ఈడీ గురువారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే ఈ కేసులోని నిందితులకు సంబంధించి కొత్త సమాచారం లభిస్తే కోర్టుకు సమర్పిస్తామని, అందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. ఇతర కేసుల్లో జగన్ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లలో కౌంటరు దాఖలు చేయడానికి ఈడీ గడువు కోరింది. వాన్‌పిక్ కేసులో ఎంపీ మోపిదేవి వెంకటరమణ హాజరవగా కేసుల విచారణ వాయిదా పడింది.
ఇదీ చదవండి: HIGH COURT : 'ప్రభుత్వ ప్రతి చర్యనూ పిల్‌తో సవాలు చేయలేరు'