తెలంగాణ.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న సభకు.. తెరాస ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని డివిజన్ల నుంచి జనసమీకరణకు గులాబీ పార్టీ శ్రేణులు కసరత్తు చేశాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెరాస నేతలు చెబుతున్నారు. సభ వద్ద శానిటైజర్లు, మాస్కులను సిద్ధంగా ఉంచుతున్నారు. సభకు హాజరయ్యే వారికి ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రాలు, కూర్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణమంతా గులాబీ జెండాలు, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లతో నింపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచే సభకు రావాలని పార్టీ నేతలు కోరారు.
శ్రేణుల భారీ అంచనాలు
కేసీఆర్ సభపై తెరాస శ్రేణులు భారీగా అంచనాలు పెట్టుకున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సభలో కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల అంశాలు ప్రస్తావించారు. ఆ తర్వాత ఎన్నికల హామీ ప్రణాళికను స్వయంగా విడుదల చేశారు. నిన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం.. నేడు ప్రధాని నరేంద్ర మోదీ నగర పర్యటన నేపథ్యంలో.. కేసీఆర్ సభపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సభలో ఏం ప్రసంగిస్తారని పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ప్రగతి నివేదిక, అభివృద్ధి ప్రణాళికలను వివరించటంతో పాటు.. భాజపా విమర్శలపై విరుచుకుపడే అవకాశం ఉంది. జాతీయ స్థాయి నుంచి స్థానిక అంశాల వరకు కమలం పార్టీపై ఎదురుదాడి చేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
ట్రాఫిక్ ఆంక్షలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 150 మంది తెరాస అభ్యర్థులు సభలో పాల్గొననున్నారు. కేసీఆర్తో పాటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, హైదరాబాద్ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపు గంటకుపైగా గులాబీ దళపతి ప్రసంగించనున్నారు. సభ నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎల్బీస్టేడియం మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు.
ఇదీ చదవండి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే