కరోనా కట్టడికోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు. ముఖ్యంగా జనం రద్దీగా వుండే ప్రాంతాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతో పాటు... కార్పోరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు... కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సీఎం సూచించారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల దృశ్యమాధ్యమ సమావేశంలో.. సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో, రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ... ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావు.. డీఎంఈ రమేశ్ రెడ్డి, ఎండీ టీఎస్మెస్ ఐడీసీ చంద్రశేఖర్... వైద్యశాఖ సలహాదారు డా. టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా... మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మతో... సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు.
వారం రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశం..
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బంది మొత్తానికి వాక్సినేషన్ ప్రక్రియను వారం రోజుల్లో నూటికి నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వాక్సినేషన్ పురోగతిని ప్రతీరోజు ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎంవోకు రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్... ఆర్టీసీ , రెవెన్యూ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం కోసం కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తక్షణమే ఏర్పాటు చేయండి..
కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు , అన్ని జిల్లాల్లోనూ కరోనాను నిర్ధారించే ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ఆర్టీపీసీఆర్ కిట్స్ తక్షణమే తెప్పించాలని... అధికారులను ఆదేశించారు. గద్వాల, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి... సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, భువనగిరి, జనగామ.. వికారాబాద్ కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కోసం కీలకమైన మాస్కులు ధరించే నిబంధనను... కఠినంగా అమలు పరచాలన్నారు. ప్రజలు మాస్కు ధరించకపోతే వేయి రూపాయల జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 45 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.
ఇవీ చూడండి: