దేశ రాజధాని దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సమావేశం సాగింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం, కేంద్ర గెజిట్‌పై అభ్యంతరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులకు అనుమతులపైన, కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై చర్చించారు.
కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు కేంద్రమంత్రికి సీఎం కేసీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నామని.. ఇప్పటికే పిటిషన్ విత్ డ్రా పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. కేంద్ర గెజిట్‌లోని ప్రాజెక్టుల పరిధి, ఇతర అంశాల అమలుకు సహకరిస్తామని అన్నారు. అమలులో ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకోవాలని కోరారు. గెజిట్ అమలు ఇంత త్వరగా సాధ్యమవుతుందా అనేది పరిశీలించాలని కోరిన కేసీఆర్.. కొంత గడువు తర్వాత అమలుపైనా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.