CM KCR Comments on Modi: దేశాన్ని భాజపా జలగలా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ.. అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెరాస లేవనెత్తిన ప్రశ్నలకు జాతీయ కార్యవర్గ భేటీలో ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. అశక్తులం అని తమ డొల్లతనాన్ని భాజపా రుజువు చేసుకుందన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని మోదీ చెప్పినట్టు గుర్తు చేసిన కేసీఆర్.. ఈ విషయంలో మోదీకి థ్యాంక్స్ చెబుతున్నాట్టు తెలిపారు. తెలంగాణ సర్కారు ఇంజిన్ స్పీడ్‌గా ఉందని.. కేంద్రంలో కూడా తెలంగాణ సర్కారులా స్పీడ్‌గా ఉన్న ప్రభుత్వం రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
"మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి విలువ పతనమైందని గొంతు చించుకుని చెప్పారు. ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో ఆయనే చెప్పాలి. గతంలో మోదీ చెప్పిన విషయాన్నే ఇప్పుడు మేమూ అడుగుతున్నాం. భాజపా అసమర్థత వల్లే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.80కి పడిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మోదీ హయాంలో రూపాయి విలువ పతనమైంది. దేశానికి మోదీ చేసిన మంచి పని ఒక్కటైనా చెప్పగలరా? తెలంగాణ తప్ప దేశమంతా చెడ్డ పవర్ పాలసీ తీసుకొచ్చారు. సాగునీరు ఇవ్వలేరు, తాగునీరు ఇవ్వడం చేతకాదు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇవ్వడం కూడా చేతకాదా? దేశ రాజధానిలో కరెంటు కోతలు, మంచినీటి కొరత ఉంది. ఇదే మీ పాలనకు నిదర్శనం. తెలంగాణలో జరిగే అభివృద్ధిలో కనీసం 10శాతమైనా భాజపా పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందా? అసమర్థ విధానాల వల్ల దేశాన్ని ఆగం పట్టించారు. రూపాయి పతనం ఆపలేరు, నిరుద్యోగాన్ని కట్టడి చేయలేరు. లొల్లి పెట్టడం ఒక్కటే మీక చేతనైంది." - సీఎం కేసీఆర్
కేంద్రంలో కూడా తెలంగాణ మాదిరి సర్కారు రావాలి..: దేశంలో అసమర్థ పాలన వల్లే దుష్ఫలితాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ జీడీపీ 128.3 శాతం కాగా.. కేంద్ర ప్రభుత్వ జీడీపీ మాత్రం 89.6 శాతంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే తెలంగాణ జీడీపీ మరింత పెరిగేదని స్పష్టం చేశారు. భాజపా ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కేంద్రంలో కూడా తెలంగాణ మాదిరి సర్కారు రావాల్సి ఉందని తెలిపారు. ఏ రకమైనా డబుల్ ఇంజిన్ సర్కారు రావాలో ప్రజలు తేలుస్తారని కేసీఆర్ అన్నారు.
"భాజపా పాలన అంతా అప్రజాస్వామిక విధానాలు, అవినీతి, కుంభకోణాలమయం. కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు నష్టపోయింది. అసెంబ్లీలో ఇదే విషయం చెప్పా. దేశంలో ఏటా కోటి 30లక్షల ఉద్యోగాలు కోల్పోతున్నారు. వీళ్ల చేతగాని తనాన్ని ప్రజలు చూశారు. అందుకే కేంద్రంలోని ప్రభుత్వం మారాలని చెబుతున్నాం. తప్పకుండా మారుస్తాం. డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని మోదీ చెప్పారు. ఈ విషయంలో మోదీకి థ్యాంక్స్ చెబుతున్నా. తెలంగాణ సర్కారు ఇంజిన్ స్పీడ్‌గా ఉంది. కాబట్టే కేంద్రంలో కూడా తెలంగాణ సర్కారులా స్పీడ్‌గా ఉన్న ప్రభుత్వం రావాలి. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పోవాలి.. భాజపాయేతర ప్రభుత్వం రావాలి. కేంద్ర ప్రభుత్వం వేగం తక్కువ.. రాష్ట్ర ప్రభుత్వం వేగం ఎక్కువ. కేంద్రంలో తప్పకుండా భాజపాయేతర డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉంది." - సీఎం కేసీఆర్
కట్టప్పా.. కాకరకాయా? ఏం చేస్తారు?..: తెలంగాణలో మూడో వంతు మెజార్టీతో తెరాస గెలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లున్న చోట ఏక్‌నాథ్ శిందే వస్తారా? అని ప్రశ్నించారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలతో విదేశాల్లో భారత రాయబారిని నిలదీస్తే క్షమాపణ చెప్పారన్నారు. భాజపా అసమర్థ విధానాల వల్ల భారత్ పరువుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని విశ్రాంత జడ్జిలతో లేఖ రాయిస్తారా? అని నిలదీశారు. భాజపా నేతలు సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి నడుస్తోందని కేసీఆర్ స్పష్టం చేశారు. సర్కారు నడుపుతున్నారా?.. గూండాయిజం చలాయిస్తున్నారా? అని నిలదీశారు. ఏక్‌నాథ్ శిందే వచ్చాక మహారాష్ట్రలో 20 శాతం విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు.
"భాజపా నేతలకు అహంకారం పెరిగింది. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లున్న చోట ఏక్‌నాథ్ శిందే వస్తారా? తెలంగాణలో మూడోవంతు మెజార్టీతో తెరాస గెలిచింది. ఇదేనా మీ పాలసీ. నుపుర్ శర్మ వ్యాఖ్యలతో విదేశాల్లో భారత రాయబారిని నిలదీస్తే క్షమాపణ చెప్పారు. భాజపా అసమర్థ విధానాల వల్ల భారత్ పరువుపోతోంది. సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని విశ్రాంత జడ్జిలతో లేఖ రాయిస్తారా?భాజపా నేతలు సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయట్లేదు. ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు. కట్టప్పలా.. కాకరకాయా? కట్టప్పలు, ఏక్‌నాథ్ శిందే.. ఇలాంటి కుక్కమూతి పిందెలా రాష్ట్రానికి కావాల్సింది? ఏక్‌నాథ్ శిందే వచ్చి ఏం చేశారు? మహారాష్ట్రలో 20శాతం విద్యుత్ ఛార్జీలు పెంచారు. మీ వల్ల ఏమవుతుంది. మన్నూ మశానం తప్ప." - సీఎం కేసీఆర్
కేంద్రంలోని భాజపా ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే.. తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తానని కేసీఆర్ అన్నారు. తేదీ ఖరారు చేస్తే.. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? అని నిలదీసిన కేసీఆర్.. దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో ఏక్‌నాథ్ శిందేలను తీసుకురావాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
ఇవీ చూడండి: