విభజన చట్టంలోని నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం (telangana govt) ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేస్తూ ఈ నెల 1న కేంద్రానికి లేఖ రాసిన సీఎం జగన్ (cm jagan).. మరోసారి ఫిర్యాదు చేశారు. కేఆర్ఎంబీ (Krishna River Management Board) కార్యాచరణ ప్రోటోకాల్స్, ఆదేశాలను పూర్తిగా విస్మరించి.. తెలంగాణ సర్కార్ అక్రమంగా వ్యవహారిస్తోందని లేఖలో ప్రస్తావించారు. విలువైన నీటిని వృథా చేస్తూ సమద్రంలోకి వెళ్లేలా చేయడంతో ఆంధ్రప్రదేశ్ హక్కుల్లో వాటాను కోల్పోయేలా చేస్తోందని తెలిపారు. కేఆర్ఎంబీ ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టకుండానే.. తెలంగాణ ప్రభుత్వం జూన్ 1 నుంచి 19 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకుందని పేర్కొన్నారు. 796 అడుగుల నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని తోడుతుందని.. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని లేఖలో సీఎం జగన్.. వివరించారు.
ఆ ప్రాంతాలకు ఇబ్బందులు తప్పవు..
తెలంగాణ రాష్ట్రం మొండి వైఖరితో చేస్తోన్న ఈ చర్య వల్ల శ్రీశైలం (srisailam)లో 854 అడుగులకు నీటి మట్టాలు చేరుకోవడం చాలా కష్టమవుతుందన్నారు. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై ఆధారపడిన పథకాలకు కాలువల ద్వారా నీటిని తరలించడం సాధ్యపడదని చెప్పారు. ఫలితంగా దీర్ఘకాలిక కరువు పీడిత రాయలసీమ ప్రాంతం సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చెన్నై నగరానికి తాగు, సాగు అవసరాల కోసం ఆధారపడే వారికి ఇబ్బందులు తప్పవన్నారు. నీటి విడుదలపై కేఆర్ఎంబీ(KRMB) ముందు కనీసం ప్రతిపాదన ఉంచకుండా తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపారు. ఏకపక్షంగా జలవిద్యుత్ ను ఉత్పత్తి కొనసాగిస్తుందని వివరించారు.
ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి...
ప్రస్తుత కృష్ణా డెల్టా వ్యవస్థను స్థిరీకరించడానికి ఉద్దేశించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన పులిచింతల ప్రాజెక్ట్ నుంచి (pulichintala project) తెలంగాణ రాష్ట్రం ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తికి నీటిని తీసుకుంటూనే ఉందని లేఖలో ముఖ్యమంత్రి జగన్ (cm jagan) ఫిర్యాదు చేశారు. ఈ నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. నీరు వృథా అవుతున్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీటిలో వాటాను కోల్పోయేలా చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యంలా కనిపిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీని కేటాయించటానికి అంగీకరించినందున ఈ అనధికార డ్రాలన్నింటికీ లెక్కించాల్సిందిగా కేఆర్ఎంబీని ఆదేశించాలని కోరారు.
అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలనే ముఖ్య ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు, సూత్రాలు, విధానాలను ఉల్లంఘించిందన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే అనేకసార్లు జలశక్తి మంత్రిత్వ శాఖ (Ministry of Jal Shakti) కు ఫిర్యాదు చేసిందని జగన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న అనధికార ప్రాజెక్టులనూ కేంద్రం దృష్టికి తీసుకువచ్చామన్నారు. కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల ను అక్రమంగా నిర్మాణం చేపడుతోందని తెలిపారు. అనధికార ప్రాజెక్టులు అమలు చేయకుండా ఉండేందుకు తాము కేఆర్ఎంబీ ముందు పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితంలేదని, వారు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదన్నారు.
కేఆర్ఎంబీ.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వివక్షపూరిత వైఖరిని చూపిస్తోందని ఫిర్యాదులో తెలిపారు. తెలంగాణ చేసే తప్పుడు ఫిర్యాదులపై కేఆర్ఎంబీ వేగంగా పనిచేస్తుందని , ఆంధ్రప్రదేశ్ నిజమైన ఫిర్యాదులను విస్మరిస్తోందన్నారు. కృష్ణా బోర్డును న్యాయమైన రీతిలో వ్యవహరించమని ఆదేశించాలని జగన్ కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 854 అడుగుల పైన ఉంటేనే నీరు వచ్చే పరిస్ధితి ఉంటుందన్న సీఎం... తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు పూర్తైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా ఒక చుక్క నీరు కూడా పోదని చెప్పారు.
వేరే మార్గం లేకే..
ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా రాయలసీమ లిఫ్ట్ పథకాని(rayalaseema lift irrigation project)కి వెళ్లడం మినహా ఏపీ రాష్ట్రానికి వేరే మార్గం లేదన్నారు సీఎం జగన్. రాయలసీమ లిఫ్ట్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త అయకట్టు, లేదా కొత్త కాలువ ,లేదా కొత్త నిల్వను సృష్టించడం లేదని సీఎం స్పష్టం చేశారు. తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడానికి మాత్రమే 800 అడుగుల నుంచి నీటిని తీసుకునేలా ప్రాజెక్టును చేపడుతున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. తాము తెలిపిన అన్ని ప్రాజెక్టులు ఏపీ భూభాగంలో కేడబ్యూడీటీ -I(Krishna Water Disputes Tribunal) చేత ఆమోదాలు పొందాయని పేర్కొన్నారు.
నీటి కేటాయింపులను కలిగి ఉన్న చట్టబద్ధమైన పథకాలని,ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనూ వీటి గురించి ప్రస్తావించారని చెప్పారు. ఈ పరిస్ధితుల్లోనే ఆంధ్రప్రదేశ్ కు మరో అవకాశం లేక రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభించామని వివరించారు. తద్వారా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులకు రోజుకు 3టీఎంసీలు అందిచడం సాధ్యమవుతుందన్నారు. సాగునీటికి నీరు అవసరంలేనప్పడు తెలంగాణ రాష్ట్రం.. విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించకుండా చూడాలని లేఖలో సీఎం జగన్ కోరారు.
వారి ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్నారు..
రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టు సందర్శన కోసం కేఆర్ఎంబీ పదేపదే ప్రతిపాదిస్తుందని కేంద్రమంత్రి షెకావత్ దృష్టికి సీఎం జగన్ తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టలకు ఎటువంటి ఆమోదాలు, నీటి కేటాయింపులు లేకుండా నిర్మిస్తున్నారనే విషయాన్ని గతంలోనూ తెలిపినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తటస్థ సంస్థగా ఉండాల్సిన కేఆర్ఎంబీ.. అలా ఉండటం లేదని ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుల పట్ల మాత్రం కేఆర్ఎంబీ వేగంగా స్పందిస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ధర్మబద్ధమైన ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణ అనధికార ప్రాజెక్టులను సందర్శించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేపదే చేసిన అభ్యర్థనలను విస్మరించి, తెలంగాణ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయల సీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించాలని పట్టుబడుతోందన్నారు. కేఆర్ఎంబీ పనితీరులో తటస్థంగా ఉండాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టును సందర్శించే ముందు, తెలంగాణ అమలులో ఉన్న అనధికార ప్రాజెక్టుల సైట్‌లను సందర్శించాలని కేఆర్ఎంబీకి సూచించాలని షెకావత్ ను సీఎం జగన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి, లేవనెత్తిన సమస్యలపై జోక్యం చేసుకుని తక్షణం చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.
కేంద్రమంత్రి జావడేకర్కు సీఎం లేఖ..
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ (prakash javadekar)కు సీఎం జగన్ (cm jagan) లేఖ రాశారు. ప్రాజెక్టు డీపీఆర్ (DPR)ను జూన్ 30వ తేదీన సీడబ్ల్యూసీ (Central Water Commission)కి అప్‌లోడ్ చేశామని వివరించారు. సీమ ఎత్తిపోతలకు భూసేకరణ చేయట్లేదని.. అటవీ ప్రాంతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల అడ్డంకుల్లేవని పేర్కొన్నారు. ప్రాజెక్టును పర్యావరణ పరిరక్షణ జోన్‌కు 10 కిలోమీటర్ల వెలుపల నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, ఏపీకి జరిగే అన్యాయంపై లేఖలో జగన్ ప్రస్తావించారు.
ఇదీ చదవండి:
Water disputes: అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా?: తెలంగాణ హైకోర్టు