పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేయనుండటం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కడప జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి ఒకేరోజు కలిసిరావడం అరుదైన సందర్భమని సీఎం జగన్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తున్నా...కోర్టు కేసు కారణంగా పులివెందులలో పంపిణీ చేయలేకపోవడం కొంచెం బాధగా ఉందన్నారు. మంచిపనులు చేసేటపుడు ఇలాంటి ఆటంకాలు రావడం సహజమేనన్నారు. ఏపీఐఐసీ భూముల్లో పట్టాలు పంపిణీ చేయకూడదని కొందరు కోర్టుకు వెళ్లారని...అవి కూడా ప్రభుత్వ భూములేనని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే సుప్రీంకోర్టుకు వెళ్లి పులివెందులలోనూ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని జగన్ అన్నారు.