రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్దతు ధరలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనంమాలకొండయ్య, మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి హాజరయ్యారు. ఇవాళ్టితో ఖరీఫ్ సీజన్ ముగుస్తోన్న దృష్ట్యా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయమై సమగ్రంగా చర్చించారు. నేడు అన్ని పంటలకు గిట్టు బాటు ధరలు ప్రకటిస్తామని.. ఇప్పటికే ప్రకటించినందున వీటిపైనా అధికారులతో సీఎం చర్చించారు.
ప్రభుత్వం ఖరారు చేసే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎక్కడా కొనుగోలు జరగకూడదని, వీలుంటే ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు జరిగేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రైతులకు ఏ విధంగా కూడా నష్టం జరగకూడదని.. ఈ విషయంలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌లో పోటీ ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి, మార్కెట్‌లో పోటీ ఏర్పడేలా చేస్తుందని స్పష్టం చేశారు. తమ పంటలు అమ్ముకోవడంలో ప్రభుత్వం రైతులకు సహాయకారిగా నిలుస్తుందన్నారు.
గత ఏడాది రైతులకు కనీస గిట్టుబాటు ధర రావాలని ప్రభుత్వం చర్యలు తీసుకుందన్న సీఎం జగన్.. దాదాపు 3200 కోట్లు కేటాయించి ప్రభుత్వం పలు పంటలు కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. ఇంకా ధాన్యం కొనుగోలు కోసం మరో 11,500 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెప్పిన దాని కన్నా ఎక్కువ కేటాయించి పంటలు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది కూడా 3300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతులకు అస్సలు ఉండకూడదన్నారు.
పంటలకు ముందుగానే ధరలు ప్రకటిస్తామని చెప్పామని, ఇవాళ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. తప్పనిసరిగా ఆ ధరలు రైతులకు దక్కేలా చూస్తామన్నారు. కనీస ధర లేక ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని, మెరుగైన ధర రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల ఉత్పత్తులకు గ్రామాల్లోనూ మార్కెటింగ్ సదుపాయం కల్పించడం కోసం జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనతా బజార్లలో తప్పనిసరిగా ఫ్రీజర్లు ఉండాలని సూచించారు. రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, హిందుస్తాన్ లీవర్ వంటి సంస్థలను కూడా జనతా బజార్లలోకి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చదవండి: