మద్యం పాలసీపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు. మద్యపాన నిషేధంపై అధికారులతో చర్చించిన సీఎం... పలు ఆదేశాలు ఇచ్చారు. సమావేశం అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వివరాలు వెల్లడించారు. బార్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం మేర బార్లు తగ్గుతాయని వివరించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లు తెరిచి ఉండాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు.
బార్లలో విక్రయించే మద్యం ధర కూడా పెంచుతామన్న మంత్రి నారాయణస్వామి... మద్యం కల్తీ చేస్తే కఠిన శిక్షలు పడేలా చట్టం తెస్తామని పేర్కొన్నారు. బార్లను రద్దు చేసి కొత్తగా లాటరీ పద్ధతిన మంజూరు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. బార్ పాలసీని అతిక్రమించే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మద్యపాన నిషేధంపై విమర్శలు చేస్తోన్న తెదేపా... అందుకు అనుకూలమో... వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్ణయం చెప్పకుండా లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.
ఆంగ్ల మాధ్యమంపై ఆరోపణలు సరికాదు..
ప్రైవేట్ పాఠశాలలకు పరిమితమైన ఆంగ్ల విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించే ప్రయత్నం చేస్తుంటే కొందరు లేనిపోని ఆరోపణలు చేయటం సరికాదని మంత్రి నారాయణ స్వామి అన్నారు. విద్యార్ధుల భవిష్యత్ కోసమే ముఖ్యమంత్రి జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : 'కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి'