అక్టోబర్‌లో అవుకు టన్నెల్ - 2 ద్వారా సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభించనున్న 6 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఆయన.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌లోనే వెలిగొండ మొదటి టన్నెల్ ద్వారా సాగు నీరు ఇవ్వాలని అన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజీల ద్వారా నీటిని ఇవ్వాలని స్పష్టం చేశారు.
అవుకు టన్నెల్ - 2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి.. అక్టోబర్‌లో ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వెలిగొండ టన్నెల్ -1లో ఇంకా తవ్వాల్సింది 700 మీటర్లు ఉందని వివరించారు. వచ్చే అక్టోబరు నాటికి టన్నెల్ -1 ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పారు.
నెల్లూరులో సంగం బ్యారేజీ పనులు సైతం అక్టోబర్ చివరికి పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు.
సీఎం ఆదేశాలివే
- డిసెంబర్లో వంశధార, నాగావళి లింక్ ద్వారా నీటిని విడుదల చేయాలి.
- వర్షపు నీరు వచ్చే సమయంలోనూ చేసుకోదగ్గ పనులు చేసుకోవాలి.
- నవంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లో గేట్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలి.
- పనులు ప్రణాళికాబద్ధంగా సాగకపోతే షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడుతుంది.. అందువల్ల తగు చర్యలు చేపట్టాలి.
- పోలవరం ముంపు బాధితులను తరలించడానికి చర్యలు తీసుకోవాలి.
- రూ.3791 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ పొందేలా చర్యలు తీసుకోవాలి.
- వర్షాకాలంలోనూ అంతరాయం లేకుండా పోలవరం పనులు చేపట్టాలి.
ముంపు బాధితులకు ముమ్మరంగా పునరావాస పనులు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి..: 'ప్రజావేదికను మళ్లీ కడతాం.. వైకాపా అరాచకాలను మ్యూజియంలో పెడతాం'