కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... కరోనా మాత్రమే కాదు.. ఏ జబ్బులు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని అనుకోలేదని వ్యాఖ్యానించారు. కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 60 ఏళ్లు పైబడిన వారిపైనే కరోనా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెప్పారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు లేనివారు కరోనా విషయంలో భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఒకరికి మాత్రమే పాజిటివ్..
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం రెండు మూడు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని సీఎం జగన్ అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు దాదాపు ఏడాది పాటు కొనసాగుతాయని వెల్లడించారు. మన రాష్ట్రంలో 70 నమూనాలు పరిశీలిస్తే ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామ వాలంటీర్లకు ఇచ్చిన యాప్ ద్వారా కూడా వివరాలు వెంటనే సేకరిస్తున్నామని పేర్కొన్నారు.