ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పురపాలక సంఘాలకు.. ప్రభుత్వ హామీతో బ్యాంకుల నుంచి రూ.800 కోట్ల రుణాలు తీసుకొని అమృత్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పనులపై సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ ‘విజయవాడ, గుంటూరులో వరదనీటి, భూగర్భనీటి¨ప్రవాహ కాలువల పనులు సత్వరం పూర్తి చేయాలి. విశాఖలో నిరంతర తాగునీటి సరఫరా ప్రతిపాదనలపై సమగ్ర కార్యాచరణ, విశాఖ మెట్రో రైల్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలి. రూ.4,578 కోట్లతో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిల్లో చేపట్టిన ఆకర్షణీయ నగరాల పనులు వేగంగా పూర్తి చేయాలి. లక్ష కంటే తక్కువ జనాభా కలిగిన 50 పట్టణాల్లో రూ.5,212 కోట్లతో చేపట్టే తాగునీటి పనులపై అధికారులు దృష్టి సారించాలి. ఈ పట్టణాలకు వెళ్లే మార్గంలో ఉన్న 111 గ్రామాలకూ తాగునీరు అందించాలి. లక్ష జనాభా దాటిన పట్టణాల్లో భూగర్భ మురుగునీటి ప్రవాహ కాలువల పనులను రూ.10,666 కోట్లతో చేపట్టేందుకు సన్నద్ధం కావాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి జులై 8న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవ్వాలి’ అని ఆదేశించారు.
తాడేపల్లి, మంగళగిరి సమగ్రాభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులకు వచ్చే నెలలో పరిపాలన అనుమతులివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రెండు పురపాలక సంఘాలను మోడల్‌గా అభివృద్ధి చేసేందుకు అధికారులు రూపొందించిన ప్రతిపాదనలపైనా సమీక్షించారు. వచ్చే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వంద శాతం తాగునీటి సరఫరా, రహదారులు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం అధికారులు ప్రతిపాదించారు. నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు పట్టణాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపైనా చర్చ జరిగింది. మంగళగిరి ఆలయాభివృద్ధి, మాడ వీధుల పునర్నిర్మాణంపైనా చర్చించారు. బకింగ్‌హాం కాలువ అభివృద్ధి, సుందరీకరణ, కూడళ్ల అభివృద్ధి, చేనేతలకు కాంప్లెక్సు నిర్మాణ ప్రతిపాదనలను సీఎం పరిశీలించారు.
ఆస్తులు అమ్మడమంటే ఆలయాలను అమ్మేయడం కాదు: మంత్రి వెలంపల్లి
తితిదే ఆస్తులు వృథా అయిపోతున్నాయనే ఉద్దేశంతోనే.. గత ధర్మకర్తల మండలి చేసిన తీర్మానం మేరకు వాటిని అమ్మేయాలనే అంశంపై ప్రస్తుత ధర్మకర్తలమండలిలో చర్చించారని దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘దేవాలయాల ఆస్తులు అమ్మడం అంటే ఆలయాలను అమ్మేయడం కాదు. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు అమ్ముడుపోయారు. ఆలయాల్లో డబ్బులు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తున్నారనే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
* గాడ్సేను భుజాన వేసుకుని మాట్లాడిన నాగబాబు ఉన్న జనసేనకు దేవదేవుడి గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు.
* వైకాపా, జగన్‌ను కించపరచడమే చంద్రబాబు విధానంగా ఉందని శాసనమండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. తెదేపా మహానాడులో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏం చేయబోతున్నారో చెప్పాలని డిమాండు చేశారు.
* లాక్‌డౌన్ కాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మహిళలపై గృహహింస కేసులు పెరిగినప్పటికీ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఇందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలే కారణమన్నారు. మిడతల దండుపై సమీక్షిస్తున్నాం: మంత్రి కన్నబాబు
ఈనాడు, అమరావతి: ‘ప్రభుత్వం ఏర్పాటై 30వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా చేసే వేడుకను రైతుల వద్ద నిర్వహించనున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. బుధవారం కన్నబాబు విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ సలహా మండళ్లలో కౌలు రైతులు, మహిళా రైతులకు అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో మిడతల దండు ప్రభావం ఉందని, అవి మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందా? లేదా? అనేది సమీక్షిస్తున్నట్లు తెలిపారు. రైతులను, వ్యవసాయాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని తెదేపా మహానాడు పేరిట నిర్వహించిన జూమ్‌నాడులో తీర్మానం చేసిందని, అసలు రైతు సంక్షేమంపై మాట్లాడే హక్కు ఆ పార్టీకి ఉందా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'విశాఖ మెట్రో రైల్ డీపీఆర్‌ను త్వరగా సిద్ధం చేయండి'