ఆంధ్రప్రదేశ్‌లో అమూల్ రాకతో మరో పాల విప్లవం మొదలవుతుందని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. పాలసేకరణ మార్కెట్లో పోటీ మంచిదేనని.. తద్వారా రైతులకు మేలు కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో పాలసేకరణకు ఉద్దేశించిన ఏపీ-అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఏపీ అమూల్-వెబ్సైట్, డాష్ బోర్డును సీఎం ఆవిష్కరించారు.
ఏపీ-అమూల్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 9899 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు అవుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను విడతల వారీగా రూ.6551 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. తొలివిడతలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలో 400 గ్రామాల్లో పాలసేకరణ మొదలు అవుతుందని సీఎం వివరించారు.
పాడి రైతులకు లీటర్‌కు అదనంగా 5 నుంచి 7 రూపాయల మేర అధిక ఆదాయం వస్తుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మార్కెట్లో పోటి తత్వం వస్తేనే అందరికీ మంచిదన్నారు. అమూల్ సంస్థ పాల మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాలను ప్రతీ ఏడాది రెండు సార్లు బోనస్‌గా రైతులకు చెల్లిస్తుందన్నారు. సహకార రంగంలో ఏర్పాటైన అమూల్.. ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీ పడుతోందని స్పష్టం చేశారు.
సహకార వ్యవస్థలో అమూల్ సంస్థ 36 లక్షల మంది రైతులే యజమానులనులుగా నడుస్తోందని ఆ సంస్థ ఎండీ ఆర్.ఎస్ సోధి స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్‌తో కలిసి ఏపీ-అమూల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గుజరాత్ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన 7 లక్షల మంది రైతులు అమూల్‌లో భాగస్వాములయ్యారని వివరించారు. దేశవ్యాప్తంగా 8 లక్షల కోట్ల టర్నోవర్ పాల వ్యాపారం నడుస్తోందని అమూల్ ఎండీ చెప్పారు.
అంతకుముందు కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లా పాడి రైతులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలకు సంబంధించిన మోడళ్లను సీఎం జగన్ పరిశీలించారు. ఏపీ-అమూల్ ప్రాజెక్టుకు సంబంధించిన పాల ట్యాంకర్‌ను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు.
ఇదీ చదవండీ...
లైవ్: ఏపీ-అమూల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్