వైఎస్ఆర్ చేయూత పథకంతో ఒక్క అడుగు ముందుకేశామని సీఎం జగన్ అన్నారు. పాత అప్పులకు జమ చేసుకోకుండా ఉండేలా నగదు అందుతుందని తెలిపారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ పథకం కింద 45ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమచేయనుందని అన్నారు.
ఆర్థిక స్వావలంబన లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు చూశా. 45-60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సహకారం అందించాలనుకున్నా. గతంలో ఈ ప్రకటన చేసినప్పుడు నాపై విమర్శలు చేశారు. ఏటా రూ.18,750 చేయూత పేరిట వారి ఖాతాలకు నగదు జమ అవుతుంది. బ్యాంకులు పాత రుణానికి జమచేసుకోకుండా ఆదేశాలు జారీచేశాం. మహిళలకు ఆర్థిక స్వావలంబన దక్కేలా సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. అముల్, పీఅండ్ జీ, ఐటీసీ, రిలయన్స్ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. వ్యాపార అవకాశాలను మహిళల వద్దకే చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారులకు రూ.18,750తో పాటు 2 పేజీల ప్రభుత్వ లేఖ వస్తుంది. ఒప్పంద సంస్థలతో వ్యాపారానికి మహిళలు నేరుగా సంప్రదించవచ్చు.- ముఖ్యమంత్రి జగన్
ఈ సందర్భంగా లబ్ధిదారులు ఏమన్నారో వారి మాటల్లోనే...
మా జీవితాలకు ఇది చేయూతే
- కరోనా కాలంలో ఉచితంగా రెండుసార్లు ఇచ్చిన రేషన్ అందింది. మా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టేందుకు చేయూత ఉపయోగపడుతుంది. స్వతంత్రంగా జీవనోపాధికి ఏర్పాట్లు చేయడం వల్ల పిల్లల భవిష్యత్తుకు ఉపకరిస్తుంది - పద్మావతి, ఒంగోలు
- రుణం తీసుకుని జిరాక్సు మిషన్ పెట్టుకున్నా. నెలకు రూ.3 వేల ఆదాయం వస్తుంది. పిండిమిల్లు పెట్టుకోవాలనేది నా కోరిక. చేయూత పథకంతో ఆ అవకాశం కల్పించారు. ఒకటో తేదీకల్లా జీతంలా పింఛను ఇస్తున్నారు.- విజయమ్మ, అనకాపల్లి
- మహిళా సంఘంలో సున్నా వడ్డీ కింద రూ.3,700 తీసుకున్నా. వైఎస్‌ఆర్ చేయూత కింద వచ్చే నెలలో రూ.39,990 తీసుకోబోతున్నా. మీరిచ్చే డబ్బుతో వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నా.- లక్ష్మీదేవి, బుక్కరాయసముద్రం,అనంతపురం జిల్లా
- ఒంటరి మహిళను, కుటుంబ భారం మోయలేని పరిస్థితిలో ఉండగా ‘చేయూత’ ఇచ్చారు. ఈ సాయంతో జిరాక్సు సెంటర్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నా.- రత్నం, యు.కొత్తపల్లి, తూర్పుగోదావరి.
ఇదీ చదవండి :
కరోనా పంజా: 23 లక్షలు దాటిన కేసులు