మహిళలకు సుస్థిర ఆదాయకల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఒంగోలులో వైఎస్సార్ ఆసరా రెండోవిడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. ‘స్త్రీని శక్తి స్వరూపిణిగా, అమ్మవారిగా కొలుస్తాం. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న రోజునే ఆసరా ఉత్సవాలు ప్రారంభమవడం శుభపరిణామం.ఈ నెల 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో డ్వాక్రా మహిళలకు ఆసరా సాయం అందజేస్తాం. 13, 15 తేదీల్లో పండగ కారణంగా ఖాతాలో నగదు జమ కాదు. కోడ్ ఉన్నందున కడప జిల్లాలో నవంబరు 6 నుంచి 15 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది’ అని తెలిపారు. ఆసరా రెండో విడతలో 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.76 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నామన్నారు. రెండు విడతల్లో అందించిన సాయం రూ.12,759 కోట్లన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను మోసం చేసిందని, దీంతో మహిళలు అప్పుల్లో కూరుకుపోయారని విమర్శించారు. రాష్ట్రంలో 18.36% ఉన్న నిరర్ధక సంఘాలు ఆసరా కార్యక్రమంతో 0.7%కు తగ్గాయని, అన్నీ ‘ఎ’ గ్రేడ్‌కు చేరాయన్నారు. ఐటీసీ, అమూల్, మహీంద్ర వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని మహిళలకు సుస్థిర ఆదాయం కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వీటితో 21వ శతాబ్దపు ఆధునిక మహిళ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్భవించాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మహిళలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను కల్పించడంతోపాటు సాంకేతిక, బ్యాంకింగ్ రంగాల్లో శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పిస్తున్నామని..
3 లక్షలకు పైగా మహిళలు వివిధ వ్యాపారాలు ప్రారంభించారని సీఎం తెలిపారు.
పదవుల్లో అవకాశాలు
రాష్ట్రంలో హోంమంత్రి అవకాశం మహిళకు ఇచ్చామని, దేశంలోనే తొలిసారి ఎస్‌ఈసీగా మహిళ ఉన్నారన్నారు. చట్టసభలు, నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకు దక్కేలా చట్టం చేశామని.. కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల్లో 52%, నగరపాలక సంస్థలు, పురపాలికలు, నగర పంచాయతీ మేయర్, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో 60.47% వారికి ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని 13 జడ్పీ ఛైర్మన్ల పోస్టుల్లో 7, వైస్ ఛైర్మన్లలో 15 మహిళలకే దక్కడం.. వారిపట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దిశ యాప్ 75 లక్షల మంది మహిళల ఫోన్లలో ఉందని.. ఫోను అయిదుసార్లు కదిపినా వెంటనే పోలీసులు వచ్చి బాధితులకు సాయం చేస్తారన్నారు. మహిళలు తమను అన్ని ఎన్నికల్లో ఆదరించారని, వారికి ఎంత చేసినా తక్కువేనన్నారు.
‘‘మహిళలకు సుస్థిర ఆదాయం కల్పించాలనే లక్ష్యంగా పని చేస్తున్నాం. గతంలో 18.36 శాతం నిరర్ధక సంఘాలు ఉండేవి. ఆసరా కార్యక్రమంతో అవి 0.7 శాతానికి తగ్గాయి. సీ, డీ గ్రేడ్ సంఘాలు ఇప్పుడు ఏ, బీ గ్రేడ్‌గా ఎదిగాయి. రుణాల రికవరీ శాతం గణనీయంగా పెరిగింది. ఐటీసీ, అమూల్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒప్పందాలతో మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేస్తున్నాం. 61 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నాం’’ అని సీఎం తెలిపారు.
ఒంగోలు తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.400 కోట్లు
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలలు కన్న వెలిగొండ ప్రాజెక్టు కచ్చితంగా పూర్తవుతుందని, 2022 ఆగస్టుకు మొదటి సొరంగం ద్వారా 3 వేల క్యూసెక్కుల నీళ్లు పారుతాయని, 2023 ఫిబ్రవరికి రెండో సొరంగం పనులు పూర్తిచేస్తామన్నారు. ఒంగోలు తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.400 కోట్ల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అంతకుముందు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పొత్తుల కోసం అర్రులు చాస్తున్నారన్నారు. జగన్ పులి లాంటివారని, ఒంటరిగానే ఎదుర్కోగల సత్తా ఆయనకి ఉందన్నారు. మరో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి తన రెండు పేజీల మేనిఫెస్టోలో తొలి ఏడాదే 90% హామీలు అమలు చేశారన్నారు. కార్యక్రమంలో ఒంగోలు, బాపట్ల ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందిగం సురేష్.. శాసనసభ్యులు మహీధర్ రెడ్డి, నాగార్జునరెడ్డి, బుర్రా మధుసూదన యాదవ్, సుధాకర్‌బాబు, కరణం బలరామకృష్ణ, అన్నా రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్ తదితరులతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత, జడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు మేయర్ సుజాత, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: