హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 17కి వాయిదా వేసింది. డిశ్చార్జి పిటిషన్లన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. దీనిని విచారించిన కోర్టు కేసును వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి కోర్టు విచారణకు హాజరయ్యారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, మాజీ ఐఏఎస్ శామ్యూల్ కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు.
కేసు పూర్వాపరాలు
2004-09 మధ్యకాలంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్విిడ్ ప్రో కో విధానంలో జగన్ అక్రమాస్తులు సంపాదించారని 2012లో సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన పారిశ్రామిక సంస్థలు.. లంచాలను జగన్ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టాయని సీబీఐ ఆరోపించింది. జగన్ పై 11కేసుల్లో సీబీఐ చార్జ్షీట్లు నమోదు చేసింది. ఈ కేసుల విచారణను ఎదుర్కొన్న జగన్ను 2012 మే లో సీబీఐ అరెస్ట్ చేసింది. 2012 మే నుంచి 2013 సెప్టెంబర్ వరకూ ఆయన చంచల్గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. 2013 సెప్టెంబర్లో బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఆయన సీబీఐ కోర్టు విచారణకు హాజరవుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు నుంచి జగన్ విచారణకు హాజరుకావడం లేదు. ఆయన చివరి సారిగా మార్చి 22, 2019న సీబీఐ కోర్టుకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా.. సీబీఐ కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందారు. 2019 ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన కోర్టుకు హాజరుకాలేదు. జగన్ తరపున ఆయన న్యాయవాదులే కోర్టుకు హజరవుతూ వస్తున్నారు. ఆ తర్వాత తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీఎం జగన్.. సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. మఖ్యమంత్రిగా అధికార విధుల్లో తీరిక లేకుండా ఉంటుందని..ఆ హోదాలో కోర్టుకు హాజరుకావడం.. ఆర్థికంగా భారం అవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే నవంబర్ 1న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్ను కొట్టేసింది. హోదా మారినంత మాత్రాన హాజరునుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావలసిందేనని స్పష్టం చేసింది. అత్యవసరం అయితే అప్పటికప్పుడు మినహాయింపు కోరవచ్చని సూచించింది. నవంబర్ నుంచి అధికారిక విధుల పేరుతో.. సీఎం కోర్టుకు హాజరుకావడంలేదు. దీనిపై ఆగ్రహించిన న్యాయస్థానం కచ్చితంగా కోర్టుకు హాజరు కావలసిందేనని జనవరి 3వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.