ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు పేరును వైకాపా అధిష్ఠానం ఖరారు చేసింది. సుదీర్ఘ మంతనాల అనంతరం సీఎం జగన్ సురేష్‌బాబు పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. సురేష్‌బాబు విజయనగరం జిల్లా సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు తనయుడు. సాంబశివరాజు సోమవారం కన్నుమూశారు.
సీఎం జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి పెన్మత్స సాంబశివరాజు ఆయనతోనే ఉంటూ వచ్చారు. వయసు రీత్యా ఆయన కొద్దికాలంగా పార్టీలో చురుగ్గా వ్యవహరించలేకపోయారు. సోమవారం ఆయన మరణించటంతో.. ఆయన కుటుంబ సభ్యులను సీఎం జగన్ ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా తనయుడు సురేష్‌బాబును ఓదార్చి.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సురేష్ బాబు పేరును ఎమ్మెల్సీ స్థానానికి జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కాగా.. నామినేషన్ దాఖలుకు ఈనెల 13 ఆఖరు తేదీ. ఈ నెల 24న ఎన్నిక జరగాల్సి ఉంది. తెదేపా బరిలో నిలిచే అవకాశాలు లేవు. ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇదీ చూడండి..
రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది: సోము వీర్రాజు