నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఆదివారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగనుంది. సంస్థ ఛైర్మన్, ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. 2019 జులై తర్వాత పాలకమండలి సభ్యులు భౌతికంగా హాజరుకానుండడం ఇదే తొలిసారి. పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యావిధానం అమలు, పట్టణ పరిపాలన తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. నీతిఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. శనివారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి దిల్లీకి చేరుకున్నారు.
జాతీయ ప్రణాళిక మండలికి ప్రత్యామ్నాయంగా ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన నీతిఆయోగ్‌లో నీతి లేదని, అది నేతిబీర చందంగా మారిందని, దాని వల్ల ఎవరికీ మేలు జరగడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతిఆయోగ్‌ను నిరర్థకంగా మార్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన దిల్లీలో జరిగే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. 'నీతి ఆయోగ్‌లో మేధోమథనం జరగడం లేదు. ధరల పెరుగుదల, రూపాయి పతనం ఇలాంటి అత్యవసర సమస్యలపై అందరం కలిసి ఏం చేద్దామనే ముచ్చటే లేదు. నీతి ఆయోగ్ సమావేశాల్లో మాట్లాడేందుకు సీఎం స్థాయి వ్యక్తికి కూడా సమయం పెట్టి అయిపోగానే బెల్ కొడుతుంటారు' అని విమర్శించారు. 'ప్రధానికి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. పాలు, బియ్యం, చేనేత, శ్మశానాలపై జీఎస్టీ ఎత్తేయండి' అని కేసీఆర్ కోరారు. పాలకమండలి ఎజెండా రూపకల్పనలో రాష్ట్రాలను భాగస్వాములను చేయడం లేదన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపణలు తప్పని నీతి ఆయోగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చూడండి : ప్రశ్నించిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులా? ఎన్హెచ్ర్సీకి ఫిర్యాదు చేస్తాం: పవన్