Civils-2021 Exam Results: సివిల్స్ -2021 తుది ఫలితాలు విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం నిర్వహించిన పరీక్షలో 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో శృతి శర్మకు మొదటి ర్యాంకు, అంకిత అగర్వాల్‌కు రెండో ర్యాంకు, గామిని సింగ్లాకు మూడో ర్యాంకు వచ్చింది.
ఈసారి అఖిల భారత సర్వీసులకు మొత్తం 685 మంది ఎంపిక కాగా.. జనరల్ కోటాలో 244 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీకి 242 మంది ఎంపిక కాగా.. మరో 90 మంది గ్రూప్ బీ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది.
సత్తా చాటిన తెలుగువాళ్లు..: మరోవైపు సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్‌కుమార్‌రెడ్డికి 15వ ర్యాంకు రాగా.. పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి (69), ఆకునూరి నరేశ్ (117), అరుగుల స్నేహ (136), బి.చైతన్యరెడ్డి (161), ఎస్.కమలేశ్వరరావు (297), విద్యామరి శ్రీధర్ (336), దిబ్బడ ఎస్వీ అశోక్ (350), గుగులావత్ శరత్ నాయక్ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్ (564), బిడ్డి అఖిల్ (566), రంజిత్‌కుమార్ (574), పాండు విల్సన్ (602), బాణావత్ అరవింద్ (623), బచ్చు స్మరణ్‌రాజ్ (676) ర్యాంకులు సాధించారు.
Civil Rankers from AP: రాష్ట్రానికి చెందిన పలువరికి సివిల్స్‌లో మంచి ర్యాంకులు వచ్చాయి. నర్సీపట్నానికి చెందిన మంత్రి మౌర్య భరద్వాజ్.. సివిల్స్‌లో 28వ ర్యాంకుతో సాధించారు. బీటెక్ చదివిన మౌర్య.. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో సివిల్స్ కోసం కృషి చేసినట్లు చెప్పారు. 28వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన శ్రీపూజ.. సివిల్స్‌లో 62 ర్యాంకుతో సత్తా చాటారు. పదో తరగతి వరకు రాజంపేటలోనే చదువుకున్న ఆమె.. ఆ తర్వాత విజయవాడలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు.. పంచాయతీరాజ్ విభాగంలో పనిచేస్తున్నారు. తండ్రి ప్రోత్సాహంతోనే సివిల్స్ ర్యాంకు సాధించినట్లు పూజ తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన అంబిక జైన్... సివిల్స్‌లో 128వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకు సాధించడం పట్ల ఆమె హర్షం వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి: