తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సినీ ప్రముఖుల భేటీలో ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శకులు, నిర్మాతలను సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. తొలుత సినీ ప్రముఖులను సీఎం జగన్ కు చిరంజీవి పరిచయం చేశారు. బహుబలి సినిమా వీరే దర్శకత్వం వహించి తెరకెక్కించారంటూ రాజమౌళిని జగన్ కు చిరు పరిచయం చేశారు. దీనికి స్పందించిన సీఎం జగన్... బహుబలి సినిమాను తాను చూశానని.... చాలా బాగుందని ప్రశంసించారు.
ప్రభుత్వ సహకారం...
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సినీ ప్రముఖుల భేటీలో సీఎం ప్రస్తావించారు. విశాఖ కేంద్రంగా స్టూడియోల నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్ వంటి ప్రాంతాలకు సినీ ప్రముఖల వల్లే క్రేజ్ వచ్చిందని జగన్ అభిప్రాయపడ్డారు. సినీ ప్రముఖులు విశాఖలో స్ధిర నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తే ఆ మేరకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుందని... ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు.
వెసులుబాటుతో మేలు...
రాష్ట్రంలో ఉచితంగా సినిమా షూటింగ్‌లు జరుపుకునేలా వెసులుబాటు ఇవ్వడం ద్వారా... సినీ పరిశ్రమకు మేలు చేశారని సీఎం జగన్ ను చిరంజీవి కొనియాడారు. ఉచితంగా షూటింగ్‌లు జరుపుకునే అవకాశం కల్పించడం వల్ల చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుందని.. సినీ నిర్మాణ ఖర్చు తగ్గుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చదంవడి: మ'రుణ' మృదంగం