వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్ల భర్తీలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు నివేదికలు ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో... కౌన్సెలింగ్ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం, సీట్ల బ్లాకింగ్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ... వైద్యారోగ్యశాఖ విభాగాల హెచ్‌ఓడీలు జూన్ 15లోగా నివేదికలు అందజేయాలని సూచించారు. జాతీయ వైద్య కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను సైతం అందులో ప్రస్తావించాలన్నారు.
500కుపైగా పీజీ సీట్లు పెరిగే అవకాశం : పీజీ వైద్య విద్యలో 2023-24 విద్యా సంవత్సరంలో 500కుపైగా సీట్లు పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తగా వైద్యుల నియామకాలను చేపట్టినందున బోధనాసుపత్రుల నుంచి వివరాలు తెప్పిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రాఘవేంద్రరావు తెలిపారు. ముఖ్యంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో తదితర విభాగాల్లో సీట్లు పెరుగుతాయని వెల్లడించారు.
వీఆర్‌ఎస్ కోసం 20 మంది దరఖాస్తు : రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 మంది సీనియర్ వైద్యులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్) కోసం దరఖాస్తు చేసినట్లు డీఎంఈ రాఘవేంద్రరావు తెలిపారు. వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ను నిషేధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాక ఈ దరఖాస్తులు రావడం చర్చనీయాంశమైంది. వీరిలో ఎక్కువ మంది ప్రొఫెసర్లున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో దరఖాస్తులు రాలేదు.
ఇదీ చదవండి: ఎంబీబీఎస్ ప్రవేశ ప్రక్రియలో అవకతవకలు... కౌన్సెలింగ్ ప్రక్రియలో లోపాలే కళాశాలలకు ఊతం!