కేంద్రం చెబుతున్నట్లుగా రూ.20,398 కోట్లతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. భూసేకరణ, పునరావాసాలకే రూ.29 వేల కోట్లు అవసరమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చిచెప్పగా కేవలం రూ.20వేల కోట్లతో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. పోలవరం తాజా పరిణామాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఒకానొక దశలో ఈ నిధులతో ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమన్న ముఖ్యమంత్రి.. కేంద్రాన్నే నిర్మాణ బాధ్యత తీసుకోమందామని కూడా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సర్వసభ్య సమావేశంలో కూడా రాష్ట్రం తరఫున ఇదే వాదన వినిపించనున్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రావత్, ధనుంజయరెడ్డి, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఇతర సలహాదారులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించి దిల్లీలో ఆర్థికశాఖ, జలవనరుల మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో ఎవరు ఏమన్నారో తొలుత మంత్రి బుగ్గన, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పెండింగు నిధుల విడుదలపై అడగ్గా ఆర్థికమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.47,725.74 కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాలకు లేఖ రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వారిద్దరితో పాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకూ లేఖలు పంపనున్నారు. మూడేళ్లుగా పోలవరం ప్రాజెక్టు అంచనాల సవరణపై సాగిన పరిణామాలు, పోలవరం అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా కమిటీ, రివైజ్డు కాస్ట్ కమిటీ 2017-18 ధరలతో ఆమోదించిన అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2017-18 ధరలతో, కొత్త క్వాంటిటీలతో ఆమోదించి పంపిన ప్రతిపాదనలను కేంద్ర జలసంఘం క్షుణ్ణంగా పరిశీలించి, సాంకేతిక సలహా కమిటీ ముందు అంచనాల సవరణ ప్రతిపాదనలు ఉంచింది. కేంద్ర జలశక్తి కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన సాంకేతిక సలహా కమిటీ ఆ ప్రతిపాదనలను రూ.55,448.87 కోట్లకు ఆమోదించింది. తర్వాత రివైజ్డు కాస్ట్ కమిటీ ఇవే ప్రతిపాదనలను రూ.47,725.74 కోట్లకు ఆమోదించి సిఫార్సు చేసిన విషయాలను ప్రస్తావిస్తూ అన్ని స్థాయిల్లో ఆమోదం లభించిన ఈ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే..
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం నిర్మాణ బాధ్యతలనే తీసుకుందని, అదీ కేంద్రం ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో ఈ పని చేస్తోందని చెప్పారు. భూసేకరణ, పునరావాసం, నిర్మాణాలకు సంబంధించి అవి ఎప్పుడు చేపడుతున్నారో అప్పటి ధరలు, నిబంధనలనే పరిగణనలోకి తీసుకోవాలని పోలవరం అథారిటీ, కేంద్ర జలసంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సిఫార్సు చేసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు, ప్రాజెక్టు పూర్తిచేసేందుకు వీలుగా కేంద్ర సంస్థలు, కేంద్ర మంత్రిత్వశాఖ చేసిన సిఫార్సు మేరకు రూ.47,725.74 కోట్లు ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరదామని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం నిధులకు పరిమితి విధించడానికి 2017లో కేంద్ర మంత్రివర్గ నోట్, 2016 నాటి పరిణామాలను కారణంగా చూపడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రస్తుత పరిస్థితులకు అవి తగవని చెప్పారు. అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలపై నాటి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.
ఇదీ చదవండీ...
ప్రజారోగ్యం దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు పెట్టలేం : కొడాలి నాని