తెలంగాణలోని మంచిర్యాల (CM KCR statue for sale in mancherial) జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీరాభిమాని (cm kcr fan). తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌ను అభిమానించిన రవీందర్.. 35పైగా బైండోవర్ కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన గొంతు కలిపాడు. ఆర్థికంగా ఇబ్బంది ఎదురైనా వెనకడుగు వేయలేదు. 2012లో దండేపల్లిలో తన సొంత ఖర్చులతో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేశాడు.
తన కష్టం చెప్పుకునే అవకాశం లేక..
ప్రత్యేక రాష్ట్రం వచ్చి.. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. తన అభిమాన నేత కేసీఆర్ సీఎం అయిన తర్వాత.. 2016లో తన ఇంట్లో సీఎం కేసీఆర్‌కు గుడి కట్టించి.. విగ్రహం ప్రతిష్టించాడు (cm kcr temple) . కుటుంబ సభ్యులతో కలిసి రోజూ పూజలు నిర్వహించేవాడు. ఆర్థిక ఇబ్బందులు వస్తే.. తనకున్న పొలాన్ని అమ్మి వ్యాపారం పెట్టుకున్నాడు. వ్యాపారంలో నష్టాలొచ్చి 2018లో రోడ్డున పడ్డాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని పలుసార్లు దీక్ష చేపట్టాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసి తన కష్టాన్ని చెప్పుకునేందుకు ప్రయత్నించగా... అపాయింట్మెంట్ దొరకలేదు. మనస్తాపంతో ప్రగతిభవన్ వద్ద పెట్రోల్‌పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని ప్రాణాలు కాపాడారు.
అప్పులు తీర్చడం కోసం..
పార్టీ కోసం ఇంత కష్టపడిన తనకు కనీసం గుర్తింపు దక్కలేదంటూ ఈ ఏడాది జనవరిలో కేసీఆర్ విగ్రహానికి ముసుగు కప్పి నిరసన తెలుపుతూ.. పార్టీ సభ్యత్వం నుంచి తప్పుకున్నాడు. అప్పులు తీర్చేందుకు, కుటుంబ పోషణ కోసం సీఎం కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు (CM KCR statue for sale) సామాజిక మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చాడు.
కేసీఆర్ అంటే నాకు ప్రాణం. తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాను. చాలా మొత్తం సొంత డబ్బులు ఖర్చు చేశాను. తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలు ఏర్పాటు చేశాను. సీఎం కేసీఆర్‌కు గుడి కట్టించి విగ్రహం పెట్టాను. కానీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి నాకు ఎటువంటి గుర్తింపు లేదు. నా పరిస్థితిని వివరించడానికి కేటీఆర్ వద్దకు కూడా వెళ్లాను. అయినా ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం భార్యా బిడ్డలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నాను. ఉద్యమ సమయంలో లక్షలు ఖర్చు చేశాను. కానీ ఇప్పుడు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీఎం కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాను. -గుండ రవీందర్, తెలంగాణ సీఎం కేసీఆర్ వీరాభిమాని