వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖను మారిస్తే... వైకాపా రౌడీ దందాలకు అడ్డాగా చేసిందని ఆరోపించారు. విశాఖ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. పలు అంశాలపై మాట్లాడారు. సొంత దుకాణాలు, బ్రాండ్లతో జనాన్ని లూటీ చేయడమే మద్యనిషేధమా..? అని చంద్రబాబు నిలదీశారు. తెదేపా హయాంలో ఇచ్చిన 10,500కోట్ల రూపాయల విలువైన ఇంటి స్థలాల్లో రూపాయి అవినీతైనా జరిగిందా అని ప్రశ్నించారు.
ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కరోనాపై కనీసం సమీక్ష చేయకపోవడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యం పట్ల కనీస బాధ్యత లేదా అని దుయ్యబట్టారు. ఎంత భయపెడితే...అదే స్థాయిలో తిరగబడే రోజులు వస్తాయనే విషయాన్ని వైకాపా గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వైకాపా అరాచకాలను చూసి విశాఖ వాసులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. వైకాపా బాధిత ప్రజానీకానికి తెదేపా అండగా ఉండాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి