ముఖ్యమంత్రి జగన్ పోలీసుల సాయం లేకుండా అమరావతిలో తిరగగలరా అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతి రైతులు, మహిళల నిరసనలు 50వ రోజుకు చేరిన వేళ.. ఐకాస నేతలతో సహా రాజధానిలో పర్యటించి వారికి సంఘీభావం తెలిపారు. రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు దీక్షా శిబిరాల వద్ద ప్రతిపక్ష నేతకు రైతులు ఘనస్వాగతం పలికారు. తుళ్లూరులో రైతుల 50 గంటల దీక్షను చంద్రబాబు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగిన ఆయన సీట్లన్నీ గెలిపించిన ప్రజలపైనే ద్వేషంతో వ్యవహరించడమేంటని ప్రశ్నించారు.
అమరావతిలో తప్పు.. విశాఖలో ఒప్పెలాా..
రాష్ట్ర ప్రజల ఆశల్ని సీఎం ఒక్కొక్కటిగా చంపేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సాయం లేకుండా బయటకు రావాలని సవాల్ చేశారు. అమరావతిలో భూ సమీకరణను తప్పుబట్టిన జగన్... ఇప్పుడు విశాఖలో అదే విధానాన్ని ఎలా అనుసరిస్తున్నారో చెప్పాలన్నారు.
చివరి స్థానంలో రాష్ట్రం
రైతులు భూములివ్వన్న అంచనాతోనే.. 30వేల ఎకరాలుంటే అమరావతికి సరేనని గతంలో జగన్ ఒప్పుకున్నారని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉన్న పలు రంగాల్లో.... ఇప్పుడు చివరి స్థానం చేరుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : అమరావతే రాజధాని అని జగన్‌తోనే చెప్పిస్తాం: చంద్రబాబు