మద్యం దుకాణాలు తెరిచి ప్రజల రక్తం పిండుకోవడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. పార్టీ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ చేశారు. దుకాణాల వద్ద గుంపులతో కరోనా పెరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. మద్యంపై ఆదాయం ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్య నిషేధానికి ఇంతకంటే మంచి సమయం ఏముంటుందన్న చంద్రబాబు.. ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడటం అమానుషమన్నారు. జె-ట్యాక్స్ కోసమే మద్యం ఉత్పత్తికి అనుమతి ఇచ్చారని ఆరోపించారు.
పంటలు కొనుగోలుపై...
రాష్ట్రంలో పదోవంతు పంటలు కొనలేదని చెప్పేందుకు కోర్టులో వేసిన అఫిడవిట్ సాక్ష్యమని చంద్రబాబు చెప్పారు. సీఎం, మంత్రులవి ప్రకటనలే తప్ప రైతులను ఆదుకున్నది శూన్యమన్నారు. మద్దతు ధరకోసం రైతులు కోర్టుకెళ్లడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.
ఇళ్లస్థలాలు కేటాయింపుపై..
ఇళ్ల స్థలాల భూసేకరణలో వైకాపా భారీ కుంభకోణానికి పాల్పడుతుందని చంద్రబాబు ఆక్షేపించారు. భూములు మెరక చేయడం పేరుతో దోచుకుంటున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో భూసేకరణే దోపిడీకి ఉదాహరణగా చెప్పిన చంద్రబాబు.. గోదావరి ముంపు ఆవభూముల్లోనూ పెద్ద కుంభకోణం చేశారన్నారు.
ఎకరం రూ.7 లక్షలు చేసే భూమిని 30 నుంచి 60 లక్షలకు కొన్నారని చెప్పారు. మడ అడవులు కొట్టేసి మెరక చేయడంలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల భూసేకరణ వైకాపా నేతలకు ఆదాయ వనరుగా మారిందన్నారు. వాస్తవ ధరకు ఆరురెట్లు ఎక్కువకు కొని వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు.
పూలవర్షంపై..
కరోనా వైరస్‌పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లపై త్రివిధ దళాలు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పూలు జల్లి అభినందించడాన్ని ప్రశసించారు.
ఇదీ చదవండి: