సేవాభావం, పేదల సంక్షేమం కోసమే రాజకీయాలని ఎన్టీఆర్ చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. రైతు సంక్షేమానికి సరికొత్త కార్యక్రమాలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు అన్నారు. పేదల పక్కా ఇళ్లకు 40ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన పార్టీ తెదేపా అని వ్యాఖ్యానించారు. తెదేపా ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మెుక్క నాటారు.
కేసీఆర్ మాటలు గ్రహించాలి
ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు కొనే పరిస్థితులు రివర్స్ అయ్యాయన్న కేసీఆర్ మాటలు అంతా గ్రహించాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందని మండిపడ్డారు. రాజకీయ పార్టీల ప్రాముఖ్యత సంపద దోచుకోవటం కాదని, భావితరాల భవిష్యత్ బాగుండేలా కృషి చేయటమేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, వైఎస్, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారని స్పష్టం చేశారు. ఆనాడు హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం ప్రభుత్వం జినోమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టిందన్నారు. ఈనాడు అక్కడే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొన్నారని గుర్తు చేశారు. త్యాగాల కోసం పనిచేసే కుటుంబం లాంటి పార్టీ తెలుగుదేశమన్నారు. 40 ఏళ్లలో 21 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశమన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల రుణం ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ వచ్చామని, గత 2 ఏళ్లలో ప్రతి కుటుంబంపై 2.50లక్షల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు బతకలేని విధంగా అన్ని ధరలు పెంచేశారని, కోవిడ్ తర్వాత ఆర్ధిక అసమానతలు బాగా పెరిగాయన్నారు.
దిల్లీ మెడలు వంచారా?
‘25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు జగన్ చెప్పారు. ఇప్పుడు లోక్‌సభలోను, రాజ్యసభలోను కలిపి వైకాపాకు 27 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక హోదా సాధించారా? పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వబోమని కేంద్రం చెబుతుంటే... ఎందుకు నిలదీయడం లేదు? ఈ రెండేళ్లలో విభజన హామీల్లో ఏ ఒక్కటైనా సాధించారా? ప్రజలకు సమాధానం చెప్పాలి. అమరావతి రూ.లక్షల కోట్ల సంపద. దాన్ని విధ్వంసం చేసి... 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాడుతున్నారు. విశాఖ ఉక్కుకు చెందిన ఏడు వేల ఎకరాల్ని అమ్మేస్తే సంస్థ బతుకుతుందని సీఎం చెప్పడం ఎంత వరకు సబబు?’ అని చంద్రబాబు మండిపడ్డారు.
‘ఈ ఆర్థిక సంవత్సరంలో 11 నెలల్లో ఆదాయం రూ.70 వేల కోట్లు ఉంటే, రూ.79 వేల కోట్ల అప్పులు చేశారు. ఆదాయానికి మించి అప్పు చేస్తే రాష్ట్రం దివాళా తీయక ఏమవుతుంది? 20 నెలల్లో రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపైనా రూ.2.50 లక్షల భారం వేశారు. బడ్జెట్ ఐదు కోట్ల ప్రజలకు సంబంధించింది. రెండేళ్లుగా ప్రభుత్వం బడ్జెట్‌పై ఆర్డినెన్సులు తెస్తోంది. శాసనసభ సమావేశాలు ఎందుకు పెట్టడం లేదని అడిగితే... కరోనా, తిరుపతి ఉప ఎన్నికలని సాకులు చెబుతోంది. - చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి: ట్వీట్ వార్: విజయసాయి వర్సెస్ సోము వీర్రాజు!