తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు... పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. చలో ఆత్మకూరు, బాధితుల ఆందోళన, రాష్ట్రవ్యాప్త నిరసనలు, పార్టీ నేతల గృహనిర్బంధం, అక్రమ కేసుల బనాయింపు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మహిళా నేత నన్నపనేని రాజకుమారి పట్ల పోలీసుల దురుసుప్రవర్తనపై చర్చించారు. పునరావాస శిబిరాన్ని పోలీసులు భగ్నం చేయడం, బాధితులను ఆయా గ్రామాలకు తరలించడం, ప్రస్తుత పరిస్థితులతోపాటు.... భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో చంద్రబాబు చర్చించారు.
గుంటూరులోని బాధిత శిబిరం నుంచి ఇళ్లకు చేరిన ఆత్మకూరు బాధితులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. మాజీ సర్పంచ్ ఏసోబుతోపాటు ఇతరులకు ఫోన్ చేసిన చంద్రబాబు... వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఊళ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో కనుక్కొన్నారు. ఇళ్లలోకి వెళ్లగలిగారా... పొలాల్లోకి వెళ్తున్నారా అని యోగక్షేమాలను అడిగారు. ఎవరికి ఎలాంటి కష్టమొచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. పార్టీ ఇచ్చిన అండతోనే తాము ఇళ్లకు చేరగలిగామంటూ వారు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు