అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... తుళ్లూరులో రైతులు చేస్తున్న దీక్షకు తెదేపా అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. మహిళలు, రైతులు, కూలీలతో మాట్లాడారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని కోసం రైతులు తమ భూములు త్యాగం చేశారని గుర్తు చేశారు. రాజధాని ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతునిస్తున్నాయని... ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దని చెప్పారు. న్యాయబద్ధమైన ఉద్యమాన్ని ఆపొద్దని... కన్నీళ్లు వద్దని అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రులు.. రైతుల వెంట ఉన్నారని గుర్తు చేశారు. దమ్ముంటే ముఖ్యమంత్రి జగన్... తుళ్లూరు, మందడం వచ్చి రైతులతో మాట్లాడాలని సవాల్ చేశారు.
వాళ్లు ఎమ్మెల్యే ఆర్కే బంధువులు...
ముఖ్యమంత్రి జగన్ను రాజధాని రైతులు కలిశారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చంద్రబాబు చెప్పారు. వాళ్లు అసలు రైతులే కాదని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆర్కే బంధువులను సీఎం జగన్ దగ్గరికి రైతుల పేరుతో తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు.
శాశ్వతంగా తప్పుకుంటా...
రాజధాని అంశంపై వైకాపా ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మళ్లీ గెలిస్తే... శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని సవాల్ విసిరారు. అమరావతిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక్క రాష్ట్రం- మూడు రాజధానుల ప్రతిపాదన నెగ్గితే... రాజధాని అంశంపై ఇక మాట్లాడబోనని స్పష్టం చేశారు.
రాజధాని అంటే తమాషాగా ఉందా?
రాజధాని అంటే వైకాపా నేతలకు తమషాలా ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు మూడు రాజధానులు అంటే.. మరొకరు 30 రాజధానులు అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆధారాలుంటే చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న తనపై ఎన్నో విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతవరకైనా పోరాడతానని ఉద్ఘాటించారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపించేలా ఉందని అన్నారు.
సీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
2015లో రాజధాని ఎంపిక జరిగిందని కేంద్రం చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతికి దాదాపు 130కి పైగా సంస్థలు వచ్చాయన్నారు. అత్యుత్తమ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇక్కడికే వస్తున్నాయని పేర్కొన్నారు. అమరావతిని ఆదర్శ రాజధానిగా చేద్దామంటే అడ్డం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ దోహ్రి అంటూ తనపై చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రభుత్వం చర్చకు సిద్ధమా అని మరో సవాల్ విసిరారు. వైకాపా ప్రభుత్వ తీరు వల్లే పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే... ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అని తెలిస్తే చాలు... పింఛన్లు తొలగిస్తున్నారని అన్నారు. రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న ఎంపీ గల్లాతో పాటు తనపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. అమరావతి కోసం ప్రజలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
కార్యాలయాలకు వైకాపా రంగులపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా