పోలవరం ప్రాజెక్టును తాము 72% పూర్తి చేస్తే.. వైకాపా ప్రభుత్వం వచ్చాక దాన్నీ ముందుకు సాగకుండా చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం సాయంత్రం ఆయన వీడియో సమావేశం ద్వారా విలేకరులతో మాట్లాడారు. ‘14 నెలల వైకాపా పాలనలో చిన్న ఇల్లు కూడా కట్టలేదు.. తెదేపా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లను నిరుపయోగంగా మార్చారు. రాజధానిలో రూ.10 వేల కోట్లతో నిర్మించిన భవనాలు ఏమవుతాయో తెలియదు.
అదంతా ప్రజల ఆస్తి.. ప్రజాధనమే.. ఏది నిజమైన అభివృద్ధి? ఏది విధ్వంసమో ప్రజలు గుర్తించాలి’ అని కోరారు. తెదేపా హయాంలో రూ.64 వేల కోట్లతో 62 నీటి ప్రాజెక్టులు చేపట్టి.. 23 పూర్తి చేశామని చంద్రబాబు వివరించారు. మూడు నెలల్లో విద్యుత్తు లోటును అధిగమించామన్నారు. కడపజిల్లా పులివెందులలో బత్తాయి తోటలు ఎండుతుంటే నీరిచ్చి కాపాడామని చెప్పారు. లింగాలను ఉద్యాన హబ్‌గా తయారు చేశామన్నారు. అనంతపురం జిల్లాకు నీరొచ్చింది కాబట్టే కియా పరిశ్రమ విచ్చేసిందని చెప్పారు. అక్కడ అనుబంధ పరిశ్రమలను రానీయకుండా వెనక్కి పంపారని వైకాపా నేతలపై మండిపడ్డారు.
మాస్కులివ్వలేనోళ్లు... రాజధానులేం కడతారు?
తెలుగుదేశం అడ్డం పడింది కాబట్టి జీతాలివ్వలేక పోయామని గతంలో చెప్పిన వైకాపా నేతలు.. ఈ నెల ఒకటిన ఉద్యోగులకు జీతాలివ్వలేదు... పింఛనూ ఏడో తారీకున ఇచ్చారనని విమర్శించారు. కరోనా సమయంలో ప్రజలకు మూడు మాస్కులు ఇవ్వలేని వాళ్లు రాజధానులేం కడతారని ఎద్దేవా చేశారు.
విశ్వసనీయత ఏదీ...
నూతన పారిశ్రామిక విధానం కంటే.. ముందు పెట్టుబడిదారుల్లో విశ్వసనీయత పెంచాలని సూచించారు. ‘చచ్చినా ఈ రాష్ట్రానికి రాబోమని, ఇక్కడ వ్యాపారమే చేయబోమని లులూ సంస్థ చెప్పింది.. పెట్టుబడిదారులకు ఎలాంటి సంకేతాలిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. కొవిడ్ నియంత్రణలో ప్రభుత్వం చతికిల పడిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆసుపత్రులకు వెళ్తే రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలు అవుతోందని వివరించారు. వెంటిలేటర్, రక్తానికీ సిఫారసు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. తెదేపా పాలనలో 13 జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. అనంతరం ‘అభివృద్ధి వికేంద్రీకరణకు అర్థం చెప్పిన తెలుగుదేశం పాలన’ పేరుతో వీడియో విడుదల చేశారు.
ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు...
కరోనాతో రాష్ట్రం అతలాకుతలమైంది. దేశ సగటు కంటే రెండింతలు ఎక్కువగా కేసులొస్తున్నాయి. వెంటిలేటర్లు, పడకలు లేక కొందరు మరణిస్తున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో తిండి కరవై బాధితులు రోడ్డు మీదకొస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేక ఆదివారం విజయవాడ కొవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇన్ని జరుగుతున్నా... ప్రభుత్వానికి ఇవేవీ ప్రాధాన్యాలు కాదు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టాలి, అమరావతిని నిర్వీర్యం చేయాలనే ఆలోచనే. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. వారికి పైశాచిక ఆనందం కావాలి. ప్రజలే వారికి బుద్ధి చెప్పాలి.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్