వైకాపా ఆరు నెలల పాలనలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మంగళగిరి తెదేపా జాతీయ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో గత 6 నెలల్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. హైదరాబాద్లో దిశ ఘటన తర్వాత రాష్ట్రంలోనూ మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలని హితవుపలికారు.
చట్టాలు అమలులో చిత్తుశుద్ధి
రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశమని చంద్రబాబు ఆవేదన చెందారు. చట్టాలు ఉన్నంత మాత్రాన సరిపోదన్న చంద్రబాబు... వాటిని అమలు చేసేవారిలో చిత్తశుద్ధి ఉండాలని అభిప్రాయపడ్డారు. చట్టాన్ని అమలు చేసేవారు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ దుష్ఫరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన చెందారు.
సత్వర న్యాయం
దిశ సంఘటన.. సత్వర న్యాయం అవసరాన్ని గుర్తు చేస్తుందని చంద్రబాబు అన్నారు. దిశ ఘటన అనంతరం పరిమాణాలు ఒక హెచ్చరికే అన్న చంద్రబాబు... అవి సందేశం మాత్రమే కాకుండా ఒక గుణపాఠం కూడా అని అన్నారు. పోలీసులు, ప్రభుత్వాలతో పాటు ప్రతిపౌరుడికీ ఈ ఘటన కనువిప్పు కావాలని ఆకాక్షించారు.
పాలనా యంత్రాగానిదే బాధ్యత
భవిష్యత్తులో ఈ విధమైన అఘాయిత్యాలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తేవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత పాలనా యంత్రాంగానిదేనని స్పష్టం చేశారు. సమర్థమైన చట్టాలు తేవడంలో, వాటి అమలులో తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుతంగా పూర్తి సహకారాన్ని అందజేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :