నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిర్మించిన భవనాలను ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగనుందని తెదేపా నేతలు వెల్లడించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన పనులను చంద్రబాబు మీడియా ప్రతినిధులకు వివరిస్తారని తెలిపారు. రైతులతోనూ ముచ్చటిస్తారని పేర్కొన్నారు. తొలుత సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే బలహీనవర్గాల కోసం నిర్మించిన గృహ సముదాయాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. ఆ తర్వాత అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవనాలను, జడ్జిల బంగ్లాలను పరిశీలిస్తారు. సీడ్ యాక్సిస్ రోడ్ ద్వారా వెంకటపాలెం మీదుగా ఉద్దండరాయపాలెం చేరుకుంటారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం విట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తారు.
వైకాపా కుట్రలు ఛేదిద్దాం
అమరావతి పర్యటనపై చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమై చర్చించారు. పర్యటనకు అవాంతరం కలిగించేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని నేతలు ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన అమరావతిని కాపాడుకునేందుకు ఈ పర్యటన జరిగి తీరాలన్న చంద్రబాబు... కుట్రలన్నింటినీ ఛేదిద్దామని నేతలకు పిలుపునిచ్చినట్లు తెలిస్తోంది. రాజకీయంగా అధికార ప్రతిపక్షాలు పరస్పరం తీవ్ర విమర్శలు, సవాళ్లు - ప్రతిసవాళ్లు చేసుకుంటుండడంతో భద్రతాపరంగానూ చంద్రబాబు పర్యటన చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి :