కరోనా దేశం మొత్తంలో ఉన్నా.. ఏ రాష్ట్రమూ ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెట్టలేదు.. మరి ఇక్కడ (ఏపీలో) ఎందుకు కోత విధించారు? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిలదీశారు. బాబు అధ్యక్షతన సోమవారం పార్టీ వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. నేతలు వైకాపా సర్కారు తీరుపై ధ్వజమెత్తారు.
ఉద్యోగుల్ని సజ్జల బెదిరించారు..
ఉద్యోగులకు తెదేపా ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో.. వైకాపా సర్కారు కోత విధించిందని నేతలు మండిపడ్డారు. రాయితీల్లో.. కోత విధించడం సీఎం పెద్ద మనసుకు నిదర్శనమా? అల్ప బుద్ధికి నిదర్శనమా? అని నిలదీశారు. నేటి ఆర్థిక పరిస్థితి కన్నా.. తెదేపా పాలనలోనే ఘోరంగా ఉందని, అయినా.. 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. సజ్జల ఉద్యోగుల్ని బెదిరించారని నేతలు ఆరోపించారు.
ప్రజాధనం లూటీ..
మద్యం కొనుగోళ్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సుమారు 6 వేల కోట్ల రాబడులను.. మద్యం కంపెనీలకు కట్టబెట్టి, వేలకోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. సెంటు పట్టా పేరుతో భూములను అధిక రేట్లకు కొని, రూ.7 వేల కోట్లు లూటీ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం అనేది.. ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం వల్ల తప్ప, కరోనా వల్ల కాదన్నారు. లూటీ, దుబారా కట్టిపెట్టి.. ఉద్యోగులు, పింఛన్‌దారులు, కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
11 వేల కోట్ల విద్యుత్ భారం..
రాష్ట్రంలో 32 నెలల పాలనా కాలంలో.. 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి, రూ.11 వేల 611 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. డిస్కమ్‌లకు ప్రభుత్వ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యుత్ సంస్థల పేరుతో తెచ్చిన అప్పుల్లో 6 వేల కోట్లు దారి మళ్లించారని తెదేపా నేతలు ఆరోపించారు. ప్రభుత్వం వాడుకున్న రూ.24 వేల కోట్లను.. డిస్కమ్‌లకు బకాయి పెట్టిందని విమర్శించారు. కరెంటు కోతలు వెంటనే నివారించడం సహా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నేతలు డిమాండ్ చేశారు.
రాజధాని భూముల తనఖా చట్ట విరుద్ధం..
హైకోర్టు తీర్పు రిజర్వులో ఉన్నప్పుడు రాజధాని భూములు తనఖా పెట్టడం చట్ట విరుద్ధమని నేతలు ధ్వజమెత్తారు. అప్పుల కోసం అమరావతిలోని వివిధ గ్రామాల పరిధిలో ఉన్న సుమారు 480 ఎకరాలను బ్యాంకుకు తనఖా పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. అదేవిధంగా.. పెంచిన సిమెంటు ధరలు వెంటనే తగ్గించాలన్నారు. భారతి సిమెంటు ప్రయోజనాల కోసం భవన నిర్మాణ రంగాన్ని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా పాలనలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్దిదారులకు స్వాధీనం చేయాలన్నారు. టిడ్కో గృహాల పేరుతో తెచ్చిన రూ.7,300 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ఇప్పుడు లబ్ధిదారుల పేరుతో మరో 4వేల కోట్ల అప్పుకు సిద్ధం అవుతున్నారని ధ్వజమెత్తారు. కల్తీ కల్లు బారినపడి మృతి చెందిన 5 మంది ఆదివాసీ గిరిజన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
పాఠశాలల విలీనం నిలిపేయాలి..
పాఠశాలల విలీనం వల్ల చిన్న పిల్లలు దూరాభారాలు పెరిగి నష్టపోతున్నారన్నారు. తెదేపా పాలనలో 25 నుండి 200 జనాభా కలిగి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఏర్పాటు చేసిందని, ప్రతి మండలంలోనూ జూనియర్ కాలేజీ స్థాపించిందని గుర్తుచేశారు. ఈ విధానం మార్చి పాఠశాలలు విలీనం చేయడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కడగండ్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నందున.. పాఠశాలల విలీన నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.