రాష్ట్రంలోని కరోనా రోగులకు ధైర్యం చెప్పేందుకు చేపట్టిన 'కొవిడ్ బాధితులకు భరోసా' కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని తెలుగుదేశం తీవ్రంగా ఖండించింది. తెదేపా నేతలను గృహ నిర్భందం చేయటంపై.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతల గృహ నిర్బంధం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నా సీఎం జగన్ గడప దాటి బయటకు ఎందుకు రావడం లేదని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు సదుపాయాలు సరిగా లేవని ఆరోపించారు.
సీఎం జగన్ రాజకీయ కక్ష సాధించడంలో చూపుతున్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాలను కాపాడటంపై చూపడం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గృహ నిర్బంధం చేసిన తెదేపా నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కరోనా నియంత్రణ పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: కరోనా మృతుల్లో.. 65% పురుషులే..!