వాహన నిబంధనల ఉల్లంఘన జరిమానాలు భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ద్విచక్రవాహనాలు, 7 సీటర్ కార్ల వరకు ఒక కేటగిరీగా జరిమానాలు విధించనున్నారు. భారీ వాహనాలను మరో కేటగిరీగా జరిమానాలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాల చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే రూ.750 జరిమానా, సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే రూ.750 జరిమానా విధించనున్నారు. అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇస్తే రూ.5 వేల జరిమానా, అర్హత కంటే తక్కువ వయసున్న వారికి వాహనం ఇస్తే రూ.5 వేల జరిమానా వేయనున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్‌కు అర్హతలేని వారికి వాహనం ఇస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేస్తే రూ.5 వేలు జరిమానా వేయనున్నారు. వేగంగా బండి నడిపితే రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10 వేలు జరిమానా వేస్తారు.
మొదటిసారి రేసింగ్‌కు రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఆర్‌సీ, ఫిట్‌నెస్ ధ్రువపత్రం లేకుంటే తొలిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.5 వేలు జరిమానా వేస్తారు. పర్మిట్ లేని వాహనాలు వాడితే రూ.10 వేలు జరిమానా విధించనున్నారు. ఓవర్ లోడ్‌కు రూ.20 వేలు.. ఆపై టన్నుకు రూ.2 వేలు అదనంగా జరిమానా కట్టాలి.
బరువు చెకింగ్ కోసం వాహనం ఆపకుంటే రూ.40 వేలు జరిమానా, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. అనవసరంగా హారన్ మోగిస్తే తొలిసారి రూ.వెయ్యి, రెండోసారి రూ.2 వేలు జరిమానా వేస్తారు. నిబంధనలు ఉల్లఘించిన తయారీదారు, డీలరు, దిగుమతిదారుకు రూ.లక్ష జరిమానా విధిస్తారు. నిబంధనలు పలుసార్లు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్సు జప్తు చేస్తారు. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: