విద్యుత్ సంస్థల నష్టాలపై కేంద్రమంద్రి ఆర్కే సింగ్ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని... పరిస్థితిని చక్కదిద్దడం సహా... నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. ఉదయ్ పథకం కింద డిస్కంల పనితీరును సమీక్షించినప్పుడు అవి దిగజారుతున్నట్టుగా కనిపించాయని తెలిపారు. 2019 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల వార్షిక నష్టాలు వేయి 563 కోట్ల రూపాయలకు చేరాయని... ఇది 2018తో పోలిస్తే 7 కోట్లు ఎక్కువని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న డిస్కంలు... సేకరించే ప్రతి యూనిట్‌కు 39 పైసలు నష్టపోతున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వశాఖలు, పట్టణ స్థానిక సంస్థల నుంచి డిస్కంలకు రావాల్సిన బకాయిలు 5 వేల 542 కోట్ల రూపాయలకు చేరాయని వెల్లడించారు. ఉదయ్ పథకం తర్వాత డిస్కంల నష్టాలను దశలవారీగా స్వీకరించాల్సిన ప్రభుత్వం... ఇంతవరకూ ఆ పని చేయలేదని తెలిపారు. ప్రస్తుతం నిర్వహణ, ఆర్థికపరంగా ఏపీ డిస్కంల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్కే సింగ్ లేఖలో హెచ్చరించారు. సీఎం జగన్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని డిస్కంలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా చూడాలని సూచించారు.
ఇదీ చూడండి:పీపీఏలపై పునఃసమీక్ష అనవసరం...సీఎం జగన్‌కు కేంద్రమంత్రి లేఖ