నిబంధనలకు విరుద్ధంగా సొంత పార్టీ వారిని స్మార్ట్ సిటీ ఛైర్మన్లుగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నియామకాలపై కేంద్రం అభ్యంతరం చెప్పడంతో 5 నెలల్లోనే ఛైర్మన్లతో రాజీనామాలు చేయించింది. వీటిని ఆమోదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 జూన్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ జారీ చేసిన స్మార్ట్ సిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీ ఛైర్మన్లుగా జి.వెంకటేశ్వరరావు, రాజాబాబు, ఎస్.పద్మజను రాష్ట్ర ప్రభుత్వం 2021 అక్టోబరు 7న నియమించింది.
నిబంధనల ప్రకారం ఛైర్మన్లుగా డివిజనల్ కమిషనరు, కలెక్టరు, మునిసిపల్ కమిషనరు, పట్టణాభివృద్ధి సంస్థ సీఈవోలలో ఎవరో ఒకరు ఉండాలి. వీరిలో ఒకరిని నియమించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ అధికారులకు బదులుగా సొంత పార్టీ నేతలను ఛైర్మన్ కుర్చీల్లో రాష్ట్ర ప్రభుత్వం కూర్చోబెట్టింది. ఛైర్మన్లుగా అధికార పార్టీ నేతల నియామకాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2022 మార్చి 9న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అధికారులకు బదులుగా రాజకీయ నేతల నియామకంపై అభ్యంతరం తెలిపిందని సమాచారం. నియామకాలను వెంటనే రద్దు చేయాలన్న ఆదేశాలతో ఛైర్మన్లతో ఐదారు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రాజీనామాలు చేయించింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది.
పురపాలకశాఖ అధికారుల పాత్ర ఎంత?
స్మార్ట్ సిటీ ఛైర్మన్లుగా అధికారులే ఉండాలని కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినా రాష్ట్రంలో నియామకాలను ఆమోదిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఎందుకు జీవోలు ఇచ్చిందన్నది ప్రశ్న. ఈ ప్రతిపాదనలు వచ్చినప్పుడు అధికారులు అభ్యంతరం చెప్పలేదా? సీఎంవో కార్యాలయం నియామక ప్రక్రియ పూర్తి చేయగానే జీవోలు జారీ చేసిందా? అనేది అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఇదీ చదవండి: "2023 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం... ఆయనకు అంకితమిస్తాం"