కృత్రిమ మేధ, డేటా సైన్సు వంటి కొత్తపోకడలు రాజ్యమేలుతున్న కాలంలో... అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడాలంటే విద్యావిధానంలో మార్పులు రావాల్సిన అవసరముంది. విద్య, నైతిక విలువలు కలగలిస్తేనే నిర్మాణాత్మక అభివృద్ధి సాధ్యం. మార్కులే కొలమానంగా మూసపద్ధతుల్లో సాగుతున్న బోధన.. నిరుద్యోగం, పేదరికానికి కారణమవుతోంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా విద్యావిధానం లేకపోవటమే ప్రధాన లోపం. వీటినుంచి విద్యార్థులను బయటపడేసే లక్ష్యంతో కేంద్రం నూతన జాతీయ విద్యావిధానాన్ని రూపొందించింది.
ప్రాథమిక, ఉన్నత విద్యలో సమూల మార్పులు రానున్నాయి. ఉన్నత విద్యలో ఆర్ట్స్, సైన్స్ అని విడివిడిగా కాకుండా... విద్యార్థుల ఆసక్తిని బట్టి సబ్జెక్టుల్ని ఎంచుకోవచ్చు. వృత్తి విద్య, శారీరక విద్య, కళలు పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉంటాయి. ప్రస్తుత కళాశాలలను 2030 నాటికి బహుళ నైపుణ్య బోధనా కేంద్రాలుగా మారాల్సి ఉంటుంది. దీనికోసం విద్యారంగానికి బడ్జెట్‌లో 6 శాతం నిధులు పెంచాలని ప్రతిపాదించారు. నూతన విద్యావిధానం అమల్లో తలెత్తే సమస్యలు, లోపాలను తెలుసుకునేందుకు కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా కార్యశాలలు నిర్వహిస్తోంది. విద్యావేత్తలు, నిపుణుల ద్వారా సమాచారం సేకరిస్తోంది.
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలంటే నిపుణులైన ఉపాధ్యాయులు ఉండాలని... పెరిగిన జనాభాకు అనుగుణంగా పోస్టులు పెంచి భర్తీ చేయాలని నిపుణులంటున్నారు. విద్యారంగంలో మార్పులు దిశగా కేంద్రం ప్రయత్నించటం ఆహ్వానించదగ్గ విషయమే అంటున్న నిపుణులు... అమలులో వాస్తవిక దృక్పథంతో ఆలోచించి సమస్యలు అధిగమించేలా కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నారు.
వైఎస్ షర్మిలను కలిసిన అజారుద్దీన్ కుమారుడు, సానియా మీర్జా సోదరి