ఏళ్ల తరబడి పసుపు బోర్డు వస్తోందని ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ నిజామాబాద్ రైతులకు నిరాశే మిగిలింది. పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెరాస రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చింది. గత ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులే హామీలు ఇచ్చి విస్మరించటంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆశలు అడియాశలు...
నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏటా 40వేల ఎకరాల్లో పసుపు పంట సాగు చేస్తున్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో అత్యధికంగా పండిస్తున్నారు. దేశంలో సాగయ్యే పసుపులో 50శాతం నిజామాబాద్ జిల్లాలోనే ఉత్పత్తి చేస్తున్నారు.
ఎకరం పంట సాగు చేసేందుకు తొమ్మిది నెలల సమయం పడుతుండగా.. లక్షన్నర వరకు పెట్టుబడి ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు. చాలాకాలంగా పసుపునకు సరైన మద్దతు ధరలేదని వాపోతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటైతే తమ కష్టాలు తీరతాయనుకుంటే ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమం తీవ్రం...
పసుపు బోర్డుపై గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులు ఉద్యమం తీవ్రతరం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఉద్యమం తారస్థాయికి చేరింది. ఎన్నికల బరిలో రైతులు నిలవటంతో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఇదే సమయంలో భాజపా తరఫున పోటీ చేసిన ధర్మపురి అర్వింద్... బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వగా రైతుల మద్దతుతో ఎన్నికల్లో నెగ్గారు.
హామీ నెరవేర్చండి...
అనంతరం నిజామాబాద్‌లో స్పైస్ బోర్డు ఎక్ట్సెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రయోజనం లేదని పసుపుబోర్డు తీసుకురావాలని రైతులు కోరారు. ప్రస్తుతం పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రం విముఖత వ్యక్తం చేయటంతో మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీ నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 15వేల మద్దతు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుందని.. కానీ, అందులో సగం కూడా రావడం లేదని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: