హైకోర్టు తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, హైకోర్టు కూడా ఓ అభిప్రాయానికి రావాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. కర్నూలుకు హైకోర్టును తరలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన పంపిందా? ఆ విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించిందా? ఇందుకు అనుసరించే విధానమేంటి? నిర్ణయాధికారంలో భాగస్వాములకు ఎలాంటి ప్రమేయం ఉంటుంది? రాష్ట్రంలోని ఇతర నగరాల్లో హైకోర్టు ధర్మాసనాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా? హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి ప్రస్తుతం ఏ దశలో ఉంది? దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే కేంద్ర న్యాయశాఖ దాన్ని న్యాయ రాజధానిగా గుర్తిస్తుందా? అన్న ప్రశ్నలకు రవిశంకర్ ప్రసాద్ సమాధానమిచ్చారు.
ఇతర నగరాల్లో ధర్మాసనాలు అడగలేదు
‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం అమరావతి ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసిన హైకోర్టు 2019 జనవరి 1 నుంచి పని చేస్తోంది. ఈ హైకోర్టు ప్రధాన పీఠాన్ని కర్నూలుకు తరలించాలని ముఖ్యమంత్రి 2020 ఫిబ్రవరిలో ప్రతిపాదించారు. అయితే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో హైకోర్టు ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని ఎలాంటి ప్రతిపాదనలూ పంపలేదు. హైకోర్టుతో సంప్రదించే రాష్ట్ర ప్రభుత్వం తరలించాలని నిర్ణయించింది. హైకోర్టు నిర్వహణ ఖర్చులను భరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు రోజువారీ పరిపాలన నిర్వహణకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత తరుణంలో.. హైకోర్టును కర్నూలుకు తరలించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టూ రెండూ అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలకు నిర్దిష్టమైన గడువేమీ ఉండదు. పైగా ఈ అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్‌జుడీస్) ఉంది’ అని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎన్నికల వరకే ఈ సమస్యలు.. తర్వాత అంతా ఒకటే: ఎస్ఈసీ