KEY MEETING ON BIFURACTION : రాష్ట్ర విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలపైచర్చించేందుకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో దిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పరిష్కరించాల్సిన అంశాలతోకూడిన అజెండాను.. కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్- 9 కింద.. ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీల విభజన, షెడ్యూల్ 10లోని సింగరేణి కాలరీస్ కంపెనీ విభజన, ఏపీ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్, నగదు బ్యాంకు నిల్వల విభజన, కేంద్ర ప్రాయోజిత పథకాల క్రింద నిధులు , ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు సంబంధించిన రుణాలుపై సమావేశంలో చర్చించనున్నారు. షెడ్యూల్- 9 కింద 89 కార్పొరేషన్లు, షెడ్యూల్ 10 కింద 107 సంస్థలు ఉన్నాయి.
మూడుముక్కలాటగా మారిన ఏపీ రాజధాని అంశంపై ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనేది ఆసక్తి రేపుతోంది. విభజన హామీల్లో భాగంగా పన్ను ప్రోత్సాహకాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయింపు, ఆర్థిక వనరుల భర్తీ, రాజధాని నగరం, జాతీయ విద్యా సంస్థల స్థాపన , కొత్త రాజధాని నుంచి రైలు కనెక్టివిటీని అందించడం లాంటి అంశాలపై చర్చించనున్నట్లు.. కేంద్రం అజెండాలో పేర్కొంది.
ఇందులో.. నూతన రాజధాని నగర సృష్టికి కేంద్ర ప్రభుత్వ మద్దతు, కొత్త రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ నిర్మాణం అంశాలను చేర్చింది. ఇందులో స్పష్టంగా.. ‘న్యూకేపిటల్ సిటీ’ అని పేర్కొన్నారేగానీ ‘న్యూ కేపిటల్ సిటీస్’ అని పొందుపరచలేదు. ఈ నేపథ‌్యంలో.. రాజధాని అంశంపై.. కేంద్రం ఏం చెప్తుంది అనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.
ఇవీ చదవండి: