జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా రాంకీ ఫార్మ లిమిటెడ్‌కు చెందిన వ్యవహారాలపై కేసులో దర్యాప్తు పూర్తయిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ఈడీ హోదా కలిగిన సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే దీనికి సంబంధించిన అదనపు సమాచారం లభించినట్లైతే సమర్పిస్తామని పేర్కొంది. విశాఖపట్నంలోని రాంకీ ఫార్మ సిటీ గ్రీన్‌బెల్ట్‌ను కుదించడం ద్వారా రాంకీకి రూ.133.74 కోట్ల లబ్ధి చేకూరగా, దీనికి ప్రతిఫలంగా జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్‌లో రూ.10 కోట్లు పెట్టుబడులు పెట్టిందంటూ ఈడీ ఫిర్యాదులో పేర్కొన్న విషయం విదితమే.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి తదితరులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లలో కౌంటరు దాఖలు చేయడానికి ఈడీ గడువు కోరింది. దీంతోపాటు విచారణ హాజరు నుంచి మినహాయింపునిస్తూ, తనకు బదులు న్యాయవాది హాజరుకు అనుమతించాలంటూ అయోధ్యరామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లోనూ కౌంటరు దాఖలు చేస్తామనగా న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు అనుమతిస్తూ విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో భాగమైన ఇందూ-గృహ నిర్మాణ మండలి కేసులో నిందితుల డిశ్ఛార్జి పిటిషన్‌లపై కౌంటరు దాఖలు చేయడానికి గడువు ఇస్తూ విచారణను 10వ తేదీకి వాయిదా వేశారు. భారతి (రఘురాం)సిమెంట్స్ డిశ్ఛార్జి పిటిషన్‌లో వాదనల నిమిత్తం విచారణ ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది.
ఇదీ చదవండి:
CBN Letter To SEC:'కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు'..ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ