మూడు రాజధానులు వద్దు... అమరావతే ఏకైక పరిపాలన రాజధానిగా కొనసాగాలంటూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న నిరసన కార్యక్రమం 231వ రోజుకు చేరింది. తుళ్లూరు, మందడం, పెదపరిమి, వెలగపూడి ప్రాంతాల్లో రైతులు, మహిళలు ధర్నాతో హోరెత్తించారు. రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన.... హైకోర్టుకు వెళ్లే మార్గంలో రైతులు, మహళలు ప్లకార్డులు చేతపట్టి తమకు న్యాయం చేయాలంటూ ప్రదర్శన నిర్వహించారు. తుళ్లూరు, రాయపూడి, మందడం, వెలగపూడి గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి భూములిచ్చి నష్టపోయామని... మూడు రాజధానులంటూ తమ జీవితాలను అంధకారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెద్దదిక్కయిన గవర్నర్ రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సంతకం చేశారని... తమకు న్యాయస్థానాలే దేవాలయాలని... అక్కడే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అవకాశవాద రాజకీయాల నుంచి అమరావతిని కాపాడాలంటూ మందడం, తుళ్లూరులో మహిళలు హనుమన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ప్రభుత్వం వైఖరి మారాలంటూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తమ ఆవేదనను వినిపించారు.
మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దుపై హైకోర్టు ఇచ్చిన స్టేపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం, ధర్మం కోసం పోరాడుతున్న తమకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెన్నుదన్నుగా నిలిచిందని... ఇది తమకు ఉపశమనమని రైతులు, మహిళలు అభిప్రాయపడ్డారు. ఇదే స్ఫూర్తితో అమరావతిని కాపాడుకుంటామని చెప్పారు. మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తుళ్లూరు, వెలగపూడిలో రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు.
కొవిడ్ నిబంధనలు, సామాజిక దూరం పాటిస్తూనే నిరసన కార్యక్రమాలు చేపడుతున్న రైతులు, మహిళలు... మలిదశ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: 24 గంటల వ్యవధిలో 9,747 కరోనా కేసులు నమోదు