ప్రస్తుత గ్రూపు-1 సిలబస్‌ను పునఃసమీక్షించాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారులను కోరుతున్నారు. 2018లో ప్రకటించిన సిలబస్‌లో అదనంగా చేర్చిన జియోగ్రఫీ సబ్జెక్టుతో బీఏ, బీఎస్సీ, బీకాం, ఎంబీఏ చేసిన వారికి సంబంధం లేదని, దీనివల్ల పోటీ పరీక్షల్లో అభ్యర్థులు వెనుకబడుతున్నారని, సన్నద్ధతకు అవసరమైన పుస్తకాలు కూడా మార్కెట్‌లో లేవని వాపోతున్నారు.
చివరిగా 2018లో తెలుగు అకాడమీ డిగ్రీకి పుస్తకాలు ప్రచురించింది. తర్వాతి పరిణామాలపై కొత్త డేటా ఎక్కడ ఉంటుందో, ఎలా సన్నద్ధం కావాలో అర్థం కావడం లేదని చెబుతున్నారు. నైతిక విలువల సబ్జెక్టులోని పాఠాలకు సంబంధించి ఆంగ్లంలోనే పుస్తకాలున్నాయి. సిలబస్ ప్రకటించి సంవత్సరాలు గడిచిపోతున్నా తెలుగులో పుస్తకాలు రాలేదు. తెలుగు అకాడమీ కూడా పుస్తకాన్ని ప్రచురించనందున అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకుని సిలబస్‌లో పేర్కొన్న భాగాల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని అభ్యర్థిస్తున్నారు. త్వరలో గ్రూపు-1 నోటిఫికేషన్ ఇవ్వనున్నందున సిలబస్‌పై అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యర్థనలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రశ్నపత్రాల్లో అనువాద దోషాలు, ముద్రణ లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సకాలంలో నియామకాల ప్రక్రియ ముగించేలా చూడాలని ఏపీపీఎస్సీ అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: JOBS : గ్రూప్1, గ్రూప్2 పోస్టుల భర్తీకి పచ్చజెండా..