Meta Ray Ban AI Smart Glasses : అంధులకు ఏఐ (Artificial intelligence) మంచి ఫ్రెండ్‌గా మారుతోంది. ఈ సాంకేతికతతో వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లద్దాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వ్యక్తులను గుర్తించడంతోపాటు, దూసుకొస్తున్న వాహనాల గురించి అప్రమత్తం చేస్తూ ప్రమాదాల నుంచి రక్షిస్తున్నాయి. వెళ్లాలనుకునే ప్రాంతానికి దారి చెప్తున్నాయి. అంధ విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం ఏఐ సాయంతో వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలన్న లక్ష్యంతో మెటా - రేబాన్ కంపెనీలు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టి, 4 నెలల కిందట స్మార్ట్ కళ్లద్దాలను అందుబాటులోకి తెచ్చాయి. ప్రస్తుతం ఐరోపా, అమెరికాల్లో మాత్రమే ఇవి పరిమితంగా లభ్యమవుతున్నాయి. త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి.
సెల్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు: టాలెంట్ ఉన్నా చూపులేకపోవడం అంధులకు అడ్డంకిగా మారుతోంది. స్టూడెంట్స్, వృత్తి నిపుణులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఒకప్పుడు బ్రెయిలీ లిపిలోనే చదువుకోవాల్సి వచ్చేది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వచ్చాక అంధుల సమస్యలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీనిని గమనించిన మెటా సంస్థ పరిశోధకులు కళ్లద్దాలకు స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను అమర్చి అందులోనే సెన్సర్లు, 12 ఎంపీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో అంధులు ధరించిన వెంటనే వారి స్పర్శ ద్వారా యాక్టివేట్ అయ్యేలా వీటిని తయారుచేశారు.
వాటిని సెల్‌ఫోన్‌కు కనెక్ట్ చేస్తే అందులోని వివరాలు, ఫొటోల ఆధారంగా ఎదురుగా వస్తున్నది ఎవరో చెబుతాయి. అలాగే వాయిస్ ద్వారా మెసేజ్‌లు, మెయిల్‌లను పంపుతుంది. కాలిఫోర్నియాలోని మెటా ప్రధాన కార్యాలయంలో ఇటీవల 300 మంది బ్లైండ్ స్టూడెంట్స్‌కి వీటిని ఇచ్చి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. సత్ఫలితాలు రావడంతో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం భారత కరెన్సీలో దీని ధర 50 వేల రూపాయలుగా ఉంది.
అమెరికాలో ఈ స్మార్ట్ కళ్లద్దాలను వినియోగిస్తున్న తన స్నేహితులు బాగా పనిచేస్తున్నాయని చెప్పారని హెచ్‌సీయూ సహాయ ఆచార్యులు డాక్టర్ అన్నవరం తెలిపారు. తొలుత ఇజ్రాయెల్ పరిశోధకులు ఈ తరహా అద్దాలు తయారు చేసినా, అవి ఖరీదు ఎక్కువని పేర్కొన్నారు. తాజాగా మెటా సంస్థ తక్కువ ధరకే తీసుకొస్తోందని, త్వరలో గూగుల్ సంస్థ సైతం స్మార్ట్ కళ్లద్దాలను మార్కెట్‌లోకి తీసుకురానుందని వెల్లడించారు. రాబోయే కాలంలో వినూత్న ఆవిష్కరణలతో అంధుల జీవితాలు సులభంగా మారనున్నాయని హెచ్‌సీయూ సహాయ ఆచార్యులు డాక్టర్ అన్నవరం తెలిపారు.
ఇవి మామూలు కళ్లద్దాలు కావు - చదివి వినిపిస్తాయి కూడా!
త్వరలో మార్కెట్లోకి యాపిల్ స్మార్ట్ గ్లాసెస్- మెటాకు పోటీగా అదిరే ఫీచర్లు..!