కొవిడ్-19 విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని మంత్రుల సూచించారు. 24 గంటల పాటు పూర్తి స్థాయిలో నడిచేలా కాల్ సెంటర్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని అధికారులను ఆదేశించారు.
గతంలో వచ్చిన ఇతర వైరస్‌లతో పోల్చితే కొవిడ్-19 వైరస్‌లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కొవిడ్-19 వైద్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేసేలా ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, రాష్ట్రంలోని పురపాలికల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. కొవిడ్-19 సమస్యపై అసత్యాలను ప్రచారం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు