26 అంశాలపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవనుంది. పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణాన్ని తీసుకునే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో నూతన పర్యాటక విధానంపై చర్చించి ఆమోదించనున్నారు. వైద్యవిద్య పరిశోధన కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్రంలోని వైద్యకళాశాలల నిర్మాణాన్ని ఈ సంస్థ పర్యవేక్షించనుంది.
సర్వే, సరిహద్దుల చట్ట సవరణపైనా చర్చించనున్న మంత్రివర్గం తగు నిర్ణయం తీసుకునే అవకాశముంది. తిరుపతిలో ల్యాండ్ సర్వే అకాడమీ ఏర్పాటుతో పాటు 40 ఎకరాల భూ కేటాయింపు అంశంపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. మరోవైపు జనవరి 9న అమ్మఒడి పథకం అమలుకు అనుమతి ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించనుంది. రైతు భరోసా మూడో విడత ఆర్థికసాయం అందించేందుకు అనుమతి కోరుతూ వచ్చిన ప్రతిపాదనకూ కేబినెట్ పచ్చజెండా ఊపనుంది.
కియా కార్ల పరిశ్రమతో పాటు అనుబంధ యూనిట్లనూ ఒకదాని కిందే గుర్తించే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. పరిశ్రమలోని రహదారులు, గ్రీనరీ ప్రాంత నిర్వహణకు అనుమతిచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశముంది. కాకినాడ సెజ్‌లో రాష్ట్ర వాటాల బదిలీపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర డెయిరీ అభివృద్ధి కార్పొరేషన్‌లో ఉద్యోగులకు వీఆరెస్ ఇచ్చే అంశంపై చర్చించనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ.. పశువుల రోగ నిర్ధరణ ల్యాబుల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం దక్కనుంది. రాష్ట్రవ్యాప్తంగా 140 యానిమల్ డిసీజ్ డయాగ్నసిస్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం దక్కే అవకాశముంది. గన్నవరం విమానాశ్రయంపైనా చర్చ జరగనుంది.
ఇదీ చదవండీ... నీరు కూడా వినియోగవనరుగా మారింది: భిక్షం గుజ్జ