హైదరాబాద్ పాతబస్తీలో బోనాల (Old City Bonalu) ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. చారిత్రక అక్కన్న, మాదన్న ఆలయం, లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం సహా పలు ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాలు సమర్పించారు. ఇవాళ ఆయా ఆలయాల్లోని రంగం కార్యక్రమం కొనసాగనుంది. అక్కన్న మాదన్న ఆలయం వద్ద ఏనుగుపై అమ్మవారిని ఊరేగిస్తారు.
అనంతరం పలు ప్రాంతాల మీదగా ఊరేగింపు జరుగుతోంది. దాదాపు 20 ఆలయాల నుంచి ఊరేగింపు కొనసాగుతుంది. చార్మినార్ మీదగా ఊరేగింపు మూసీనది వరకు సాగుతోంది. పోలీసులు పాతబస్తీలో సుమారు 8 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. భక్తులందరూ కరోనా నిబంధనలు పాటించి ఊరేగింపులో పాల్గొనాలని పోలీసు అధికారులు సూచించారు.
మద్యం దుకాణాలు బంద్..
బోనాలు పురస్కరించుకొని హైదరాబాద్ మహానగర పరిధిలో మద్యం దుకాణాలు మూసివేశారు. నేటి నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:సింధుకు ఒలింపిక్ పతకం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రశంసలు